బీబీసీ డాక్యుమెంటరీ "ఇండియా: మోడీ క్వశ్చన్ " సిరీస్ ఓ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2002 గుజరాత్ అల్లర్ల ఆధారంగా రెండు ఎపిసోడ్ ల డాక్యుమెంటరీ రూపొందించబడింది. అయితే... దీనిపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ నిషేధంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సమయంలో విచారణ వాయిదా పడింది.
అవును... బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ "ఇండియా: మోడీ క్వశ్చన్" పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేదాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇందులో భాగంగా... 2025 జనవరికి వాయిదా వేసింది. కేంద్రం ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ ను ఇంకా నమోదు చేయకపోవడంతో ధర్మాసనం ఈ కేసును వచ్చే ఏడాదికి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా... కేంద్రం తరుపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.
కాగా... 2002 గుజరాత్ అల్లర్లు దేశంలో ఎంత సంచలనంగా మారాయనేది తెలిసిన విషయమే. ఈ అల్లర్లలో సుమారు వెయ్యి మందికి పైగా మరణించగా.. సుమారు లక్ష మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు చెబుతారు!
దీంతో.. ఈ అల్లర్ల ఆధారంగా రెండు ఎపిసోడ్ ల డాక్యుమెంటరీ రూపొందించబడింది! ఇది 2023 జనవరిలో ప్రసారం కావాల్సి ఉంది. అయితే.. ఈ డాక్యుమెంటరీని ప్రధాని మోడీని కించపరిచే విధంగా ఉందని భారత్ లో విడుదల చేయకుండా కేంద్రం నిషేధం విధించింది. దీనికి సంబంధించిన లింక్స్ ను షేర్ చేసుకునే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లోనూ బ్లాక్ చేసింది!