Begin typing your search above and press return to search.

‘బతుకమ్మ కుంట’.. ఇది ఈ ఏడాది హైడ్రా బిడ్డ అందిస్తున్న ‘బతుకమ్మ’

బతుకమ్మ కుంట.. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని పెద్ద కుంట. ఒకప్పుడు 20 ఎకరాలకు పైగా ఉండేదట.

By:  Tupaki Desk   |   9 July 2025 8:51 AM IST
‘బతుకమ్మ కుంట’.. ఇది ఈ ఏడాది హైడ్రా బిడ్డ అందిస్తున్న ‘బతుకమ్మ’
X

సరిగ్గా ఏడాది అవుతోంది హైడ్రా ఏర్పాటై...! హైదరాబాద్‌లో సహజ వనరుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ ఈ ఏడాదిలో ఎంతో పేరు తెచ్చుకుంది హైడ్రా. కొన్ని విమర్శలు ఉన్నా.. పాజిటివ్‌ అంశాల ముందు తేలిపోయేవే..! దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను తీరుస్తూ.. ఆక్రమణలను కూలుస్తూ సగటు నగర ప్రజల్లోనూ హైడ్రాపై నమ్మకం ఏర్పడింది. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే ఉదాహరణను చూస్తే నిజంగానే హైడ్రా ఇంత ప్రభావవంతంగా పనిచేసిందా? అని ఆశ్చర్యపోతారు.

బతుకమ్మ కుంట.. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని పెద్ద కుంట. ఒకప్పుడు 20 ఎకరాలకు పైగా ఉండేదట. అందులోనే బతుకమ్మలను నిమజ్జనం చేసేవారని ఎంతో గొప్పగా చెప్పేవారు. కాలక్రమంలో బతుకమ్మ కుంట కబ్జాల పాలైంది. ఈ తరం వారికి అయితే బతుకమ్మ కుంట ప్రత్యేకతనే తెలియకపోయింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ, అంబర్‌పేట వాసి అయిన వి.హనుమంతరావు (వీహెచ్‌) ఎన్నోసార్లు బతుకమ్మ కుంట గురించి లేవనెత్తారు. కానీ, ఎవరికీ పట్టలేదు.

బతుకమ్మ కుంట క్రమేణా ఆక్రమణలకు గురవుతూ 20 ఎకరాల నుంచి 6 ఎకరాలకు పడిపోయింది. అయితే, హైడ్రా రంగంలోకి దిగాక ఆరు నెలల్లోనే బతుకమ్మ కుంట ముఖచిత్రమే మారిపోయింది. ఈ ఏడాది జనవరి, ఇప్పటి ఫొటోలు చూస్తే ఇది బతుకమ్మ కుంటేనా? అనిపిస్తోంది. అంతగా పునరుద్ధరణ చేపట్టింది హైడ్రా.

ఫిబ్రవరిలో మొదలైన పనులు సెప్టెంబర్ వరకు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే బతుకమ్మ కుంటలో నీరుంది. చుట్టూ బండ్‌ నిర్మించారు. కుంటు పరిసరాలను శుభ్రం చేశారు. చూస్తుంటే.. ఈ కుంట అసలు హైదరాబాద్‌లోనిదా? వేరే దేశంలోనిదా? అనిపిస్తోంది.

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చొరవతో సుందరంగా మారిన బతుకమ్మ కుంట.. ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి సిద్ధం కానున్నది. అంటే.. ఆడబిడ్డలు తమ బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు మంచి వేదికగా మారనుంది. ఇక బతుకమ్మ కుంట అనేది ఎవరో చెబితే వినడమే తప్ప పెద్దగా చూడనివారికి ఇకపై పిక్నిక్‌ స్పాట్‌ కానుంది. అంతగా పరివర్తన తెచ్చిన హైడ్రాను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ’బతుకమ్మ కుంటకు.. ఇది హైడ్రా బిడ్డ సమర్పిస్తున్న బతుకమ్మ’ అని కొనియాడుతున్నారు. హైడ్రా ఏర్పాటు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డిని కూడా ప్రశంసిస్తున్నారు. కాగా బతుకమ్మ కుంట పునరుద్ధరణకు రూ. 7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా.