Begin typing your search above and press return to search.

బతుకమ్మ చీరలు రెడీ అవుతున్నాయా ?

అందుకనే సెప్టెంబర్ నెలలోనే చీరలను పంపిణీ చేయటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

By:  Tupaki Desk   |   16 Aug 2023 6:09 AM GMT
బతుకమ్మ చీరలు రెడీ అవుతున్నాయా ?
X

ఓటర్లను ఆకట్టుకోవడానికి వెయ్యి మార్గాలు. ఏ మార్గం సక్సెస్ అవుతుందో తెలీక రాజకీయ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీయార్ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయటం అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే అక్టోబర్లో పండుగ సందర్భంగా చీరల పంపిణీ జరుగుతుంది. ఈసారి చీరల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందని అనుకున్నట్లున్నారు. అందుకనే నెలరోజుల ముందే బతుకమ్మ పండుగ పేరుతో చీరల పంపిణీకి ప్రభుత్వం రెడీ అయిపోతోంది.

అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని అనుకుంటున్నారు. అందుకనే సెప్టెంబర్ నెలలోనే చీరలను పంపిణీ చేయటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే 30 లక్షల చీరలను రెడీ చేసింది. మరో 20 లక్షల చీరలు రెడీ అవుతున్నాయి. మొత్తం మీద కోటి చీరల దాకా పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. నిజానికి బతుకమ్మ పండుగ పేరుతో చీరల పంపిణీ అన్నది దండగమారి ఖర్చే. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కూడా బతుకమ్మ పండుగను జనాలందరు బాగానే చేసుకునేవారు.

అయితే అప్పట్లో ఏ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ఎవరికీ చీరలను పంపిణీ చేయలేదు. చీరల పంపిణీ అన్నది కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత జాగృతి సంస్థ తో మొదలైంది. తన సంస్థను పాపులర్ చేయటానికి, వ్యక్తిగతంగా ఇమేజి పెంచుకునేందుకే కవిత చీరల పంపిణీ మొదలుపెట్టారు. అప్పటినుండి ప్రభుత్వానికి చీరల ఖర్చులు మొదలైంది.

సరే పంపిణీ చేస్తున్నవి చేనేత చీరలే కాబట్టి కనీసం ఏదో రూపంలో చేనేతలకు మంచి జరుగుతోంది కదాని ఎవరూ ఖర్చుల గురించి పట్టించుకోవటంలేదు. ప్రభుత్వం నుండి ఆర్డర్లు రాగానే సిరిసిల్ల ప్రాంతంలోని నేతన్నలు పనులు మొదలుపెట్టేసి బిజీ అయిపోయారు. ఆర్డర్ల ప్రకారం చీరలను రెడీచేయటానికి, పంపిణీకి నేతన్నలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. సుమారు 15 వేలమంది నేతన్నలు 25 వేల మగ్గాల మీద పనిచేస్తున్నారు. అక్టోబర్ 15వ తేదీనుండి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. ఈలోగానే అంటే సెప్టెంబర్ చివరికల్లా చీరల పంపిణీ అయిపోవాలన్నది ప్రభుత్వం టార్గెట్. 240 డిజైన్లలో చీరలు నేయటానికి ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది.