Begin typing your search above and press return to search.

బియ్యం గోనె సంచులకు లగ్జరీ విలువ: అమెరికాలో ట్రెండీ బాస్మతి 'కోటు'

ప్రపంచవ్యాప్తంగా తన సువాసన, రుచితో పేరుగాంచిన భారతీయ బాస్మతి బియ్యం, ఇప్పుడు అమెరికాలో ఓ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

By:  Tupaki Desk   |   12 July 2025 11:45 AM IST
బియ్యం గోనె సంచులకు లగ్జరీ విలువ: అమెరికాలో ట్రెండీ బాస్మతి కోటు
X

ప్రపంచవ్యాప్తంగా తన సువాసన, రుచితో పేరుగాంచిన భారతీయ బాస్మతి బియ్యం, ఇప్పుడు అమెరికాలో ఓ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, బాస్మతి బియ్యం ప్యాక్ చేసే గోనె సంచులే ఇప్పుడు హై-ఫ్యాషన్ ప్రపంచంలో లగ్జరీ 'కోట్లుగా' మారి, లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి.

సాధారణంగా వృథాగా పడి ఉండే ఈ బియ్యం గోనె సంచులను సేకరించి, వాటిని అధునాతన డిజైన్‌లతో స్టైలిష్ కోట్లుగా మార్చి అమెరికాలోని కొన్ని స్టోర్‌లు విక్రయిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి మేలు చేసే పునర్వినియోగ ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయోగం, ఊహించని విధంగా భారీ ప్రజాదరణ పొందింది.

ప్రారంభంలో ఈ కోట్లు సుమారు $500 (సుమారు రూ. 42,000) ధరకు అందుబాటులో ఉండగా, వీటి డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఒక్కో కోటు ధర $2,000 (సుమారు రూ. 1.75 లక్షలు) వరకు చేరింది. ఈ అద్భుతమైన స్పందనను గమనించిన అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్‌లు, పెద్ద సంఖ్యలో బాస్మతి గోనె సంచులను సేకరించి 'లిమిటెడ్ ఎడిషన్' కోట్లను విడుదల చేస్తున్నాయి.

ఫ్యాషన్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ట్రెండ్ భారతీయ బాస్మతి బియ్యానికి ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే కాకుండా, పర్యావరణ అనుకూలమైన వస్తువులను ఫ్యాషన్ రంగంలో ఉపయోగించాలనే నూతన ఆలోచనలకు ఊతమిచ్చింది. సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని ఫ్యాషన్ ప్రపంచం విశేషంగా అభినందిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో మన దేశంలో కూడా ఇలాంటి పునర్వినియోగ పద్ధతులపై కొత్త ప్రయోగాలు చేయడం ద్వారా స్థానిక కళాకారులు, కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని, అలాగే భారతీయ ఉత్పత్తుల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింతగా చాటవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. బియ్యం తినడం ఆరోగ్యానికి మంచిది కావచ్చు, కానీ ఇప్పుడు బాస్మతి కోటు ధరించడం సరికొత్త ట్రెండ్ అనడంలో సందేహం లేదు!