Begin typing your search above and press return to search.

తొలి ప్రధాని నేతాజీ.. ఇది కాషాయ చరిత్ర...!

దేశానికి తొలి ప్రధాని నెహ్రూ కాదని నేతాజీ అని ఆణిముత్యం లాంటి మాటలని వెలువరించారు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసవ గౌడ పాటిల్.

By:  Tupaki Desk   |   29 Sep 2023 12:30 AM GMT
తొలి ప్రధాని నేతాజీ.. ఇది కాషాయ చరిత్ర...!
X

దేశంలో ఒక చరిత్రను జనాలు చదువుకున్నారు. అందులో దేశానికి తొలి ప్రధానిగా పండిట్ నెహ్రూ పేరు ఉంటుంది. అయితే కాషాయ పార్టీ చరిత్రను మారుస్తోంది అని కాంగ్రెస్ సహా విపక్షాలు ఎపుడూ ఆరోపిస్తూ ఉంటాయి. ఇపుడు అలాంటిదే మరోటి జరిగింది.

దేశానికి తొలి ప్రధాని నెహ్రూ కాదని నేతాజీ అని ఆణిముత్యం లాంటి మాటలని వెలువరించారు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసవ గౌడ పాటిల్. చరిత్రలో భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఉందని, కానీ నిజానికి అది కానే కాదని, మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని పాటిల్ కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ రకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన దీనికి తనదైన లాజిక్ ని కూడా జోడించారు. తొలి ప్రధాని నేతాజీ ఎలా అయ్యారు అని చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్రం అహింస వల్ల రాలేదని, నేతాజీ భయం ఏంటో తెల్ల దొరలకు చూపించడం వల్లనే వచ్చిందని అన్నారు. నేతాజీ దెబ్బకే బ్రిటిష్ వారు జడిసి స్వాతంత్రం ఇచ్చారని ఆయన అంటున్నారు.

నేతాజీ వంటి వారు బ్రిటిషర్లను భయపెట్టడం వల్లే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అంబేడ్కర్ కూడా తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారని పాటిల్ చెప్పుకొచ్చారు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాతనే బ్రిటిష్ వారు మూటా ముల్లె సర్దుకున్నారని అన్నారు. అంటే అది పాటిల్ చెప్పిన ప్రకారం 1942 అన్న మాట.

అంటే మనం చెప్పుకునే 1947 ఆగస్ట్ దాకా చూడకుండా అయిదేళ్ల ముందే స్వాతంత్రం వచ్చిందని ఆయన వివరిస్తున్నారు. అలా దేశంలోని కొన్ని ప్రాంతాలు స్వాతంత్ర్యం తానుగా ప్రకటించాయని చెప్పారన్నారు. ఆయా ప్రాంతాల వారికి సొంత కరెన్సీ, జెండా, జాతీయ గీతం ఉండేవన్నారు. అప్పటికి దేశ ప్రధానిగా ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నడిపిస్తోన్న నేతాజీ మాత్రమే ఉన్నారని అంటున్నారు.

అలా కనుక చూసుకుంటే తొలి ప్రధాని నేతాజీ అని కొత్త చరిత్రను పాటిల్ వినిపించారు. ఇక భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్ల లేదా సత్యం, ధర్మం అంటూ ఒక చెంపపై దెబ్బ కొడితే మరో చెంప చూపించడం వల్ల కానీ స్వాతంత్ర్యం రాలేదని ఆయన విమర్శించారు. దీనిని బట్టి చూస్తే నేతాజీ మాత్రమే తొలిప్రధాని అని ఆయన అంటున్నారు.

ఇదిలా ఉంటే 1935లో నేతాజీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడి మరీ గెలిచారు. అయితే గాంధీ తన ఎంపిక పట్ల విముఖంగా ఉన్నారని ఆ పదవికి ఆయన రాజీనామా చేసి తప్పుకున్నారని చరిత్రలో ఉంది. ఇక నాటి నుంచి ఆయన అజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించి పోరాటం చేశారు. నేతాజీ 1945 ప్రాంతంలో దేశం విడిచి వెళ్లారు.

ఇక దేశంలోని కేంద్ర అధికారాన్ని తమ వద్ద ఉంచుకుని అప్పటి రాష్ట్రాలు సంస్థానాలకు 1935 తరువాత పాలించుకునే అవకాశం బ్రిటిష్ వారు కల్పించారు. . ఏది ఏమైనా నేతాజీ తొలి ప్రధాని అని పాటిల్ చెప్పడం మాత్రం వివాదాన్ని రేకెత్తించేలా కనిపిస్తోంది.