Begin typing your search above and press return to search.

9 నెలల్లో ₹350 కోట్లు సంపాదించిన ట్రంప్ కుమారుడు!

పెట్టుబడిదారుల విశ్వాసం, ట్రంప్ కుటుంబ వ్యాపార బ్యాక్‌గ్రౌండ్ వల్ల కంపెనీ వాటాలు, నాణేలు (టోకెన్లు) విపరీతంగా అమ్ముడయ్యాయి.

By:  Tupaki Desk   |   24 Jun 2025 8:00 AM IST
9 నెలల్లో ₹350 కోట్లు సంపాదించిన ట్రంప్ కుమారుడు!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, కేవలం 19 ఏళ్ల వయసులోనే భారీ సంపాదనతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. బారన్ ట్రంప్‌ కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే సుమారు 40 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు ₹350 కోట్లు) సంపాదించి సంచలనానికి కారణమయ్యాడు.

ఈ విషయం ప్రముఖ వ్యాపార పత్రిక ఫోర్బ్స్ వెల్లడించగా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చలు నడుస్తున్నాయి. బారన్ ఈ అద్భుతమైన ఆర్థిక విజయాన్ని ట్రంప్ కుటుంబానికి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టోకరెన్సీ సంస్థ ద్వారా సాధించినట్లు సమాచారం. తొమ్మిది నెలల క్రితం ఈ కంపెనీకి స్థాపక సభ్యుడిగా బారన్ ట్రంప్ ప్రధాన పాత్ర పోషించాడు. తన తండ్రి డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అన్నలు డాన్ జూనియర్, ఎరిక్‌లను ఒప్పించి ఈ క్రిప్టో ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడట.

ఈ సంస్థ క్రిప్టో మార్కెట్లో ప్రవేశించిన మొదటి దశ నుంచే మంచి ఆదరణ పొందింది. పెట్టుబడిదారుల విశ్వాసం, ట్రంప్ కుటుంబ వ్యాపార బ్యాక్‌గ్రౌండ్ వల్ల కంపెనీ వాటాలు, నాణేలు (టోకెన్లు) విపరీతంగా అమ్ముడయ్యాయి. దీనివల్ల కంపెనీకి వచ్చిన ఆదాయం భారీగా పెరిగింది. దాంతో బారన్ ట్రంప్‌కు 40 మిలియన్ డాలర్లకు పైగా మిగిలిందని ఫోర్బ్స్ రిపోర్ట్‌లో పేర్కొంది.

-యువ వయసులోనే గొప్ప వ్యాపార విజయాన్ని సాధించిన బారన్

బారన్ ట్రంప్ చాలా రోజుల పాటు రాజకీయాలకే పరిమితమవుతాడని చాలామందికి అభిప్రాయం. కానీ ఈ క్రిప్టో రంగంలో అతను చూపించిన వ్యాపార విజ్ఞానం అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్లాక్‌చైన్ టెక్నాలజీ, డిజిటల్ కరెన్సీల గురించి బారన్‌కు ఉన్న అవగాహన, మార్కెట్‌ను అంచనా వేయగల సామర్థ్యం ఈ విజయానికి కారణమన్నది నిపుణుల అభిప్రాయం.

-ట్రంప్ కుటుంబంలో నుంచి మరో వ్యాపార దిగ్గజం?

ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యంలో ప్రధాన పాత్ర పోషించినవారు డాన్ జూనియర్, ఎరిక్‌లే. కానీ బారన్ తక్కువ వయసులోనే తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రిప్టో రంగ విజయం అతనికి భవిష్యత్తులో మరిన్ని వ్యాపార అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ విజయంతో అమెరికా యువతలో కూడా బారన్ ట్రంప్‌పై ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియాలో బారన్‌కు అనూహ్యమైన ఫాలోయింగ్ పెరుగుతోందట. క్రిప్టో రంగానికి చెందిన పెద్ద సంస్థలూ ఇప్పుడు అతనితో భాగస్వామ్యం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయట.

మొత్తానికి బారన్ ట్రంప్ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కాకుండా వ్యాపార రంగంలో తనదైన మార్క్ వేయాలని స్పష్టంగా చూపిస్తున్నాడు. కేవలం 19 ఏళ్ల వయసులో ₹350 కోట్ల సంపాదన సాధించడమే అందుకు నిదర్శనం.