జబల్ పూర్ ప్రమాద ఘటనలో కీలక వీడియో.. ముందస్తు లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం వల్లే పెరిగినమరణాలు..
సహాయక బృందాల పనితీరుపై ప్రజలు మండిపడుతన్నారు. సాయంత్రం 6.15 గంటలకు ప్రమాదం జరగగా, సమాచారం అందినప్పటికీ సహాయక బృందాలు 6.40 వరకు బయలుదేరలేదని అంటున్నారు.
By: Tupaki Political Desk | 2 May 2026 3:14 PM ISTజబల్‌పుర్‌లోని బర్గీ జలాశయంలో జరిగిన బోటు ప్రమాదం వింటేనే గుండె తరుక్కుపోతోంది. ఆ మాతృమూర్తి మరీనా, ప్రాణాలు పోయే స్థితిలో కూడా తన కుమారుడు త్రిషాన్‌ను విడిచిపెట్టకుండా అక్కున చేర్చుకొని కనిపించిన దృశ్యం మాతృప్రేమకు నిదర్శనంగా నిలుస్తూ కంటతడి పెట్టిస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లాలో నర్మదా నదిపై ఉన్న బర్గీ జలాశయంలో జరిగిన ఈ ప్రమాదం పర్యాటక రంగంలో భద్రతా లోపాలను మరోసారి ఎత్తిచూపింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రాణాలతో బయటపడగా, 9 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు బోటులోకి నీరు చేరుతుండగా పర్యాటకులు చేసిన హాహాకారాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వెలుగులోకి వీడియో
ప్రమాదానికి ముందు వెలుగులోకి వచ్చిన వీడియోలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. బోటు కుదుపులకు గురవుతున్న సమయంలో సిబ్బంది లైఫ్ జాకెట్లకు సంబంధించి మూటలు విప్పుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. బోటు ఎక్కగానే మొదట ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు ఇవ్వాలి కానీ నిర్వాహకులు అలా చేయలేదు. ఇలా చేయకపోవడమే మృతుల సంఖ్య భారీగా పెరిగేందుకు ప్రధాన కారణమని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. బోటులోకి నీరు వస్తున్న దృశ్యాలు, పర్యాటకులు ప్రాణ భయంతో అరుస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది.
సహాయక చర్యల్లో కూడా తీవ్ర జాప్యం
సహాయక బృందాల పనితీరుపై ప్రజలు మండిపడుతన్నారు. సాయంత్రం 6.15 గంటలకు ప్రమాదం జరగగా, సమాచారం అందినప్పటికీ సహాయక బృందాలు 6.40 వరకు బయలుదేరలేదని అంటున్నారు. తమ వాహనం పాడవడం వల్లే ఆలస్యమైందని సిబ్బంది చెబుతుండగా, 7 గంటల సమయంలో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మత్స్యకారులు, రైతులు స్పందించి 15 మందికి పైగా పర్యాటకులను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ప్రభుత్వం కఠిన చర్యలు
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్రూయిజ్ కార్యకలాపాలు, మోటార్ బోట్ సేవలు, వాటర్ స్పోర్ట్స్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. క్రూయిజ్ పైలట్ మహేష్ పటేల్, సహాయకుడు ఛోటేలాల్, టికెట్ కౌంటర్ ఇన్‌ఛార్జి బ్రిజేంద్రను విధుల నుంచి తొలగించగా, బోట్ క్లబ్ మేనేజర్ సునీల్ మరావిని సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, సస్పెన్షన్లు చేయడం పరిపాటిగా మారింది. కానీ, ముందే తగిన జాగ్రత్తలు పాటించి ఉంటే 9 మంది ప్రాణాలు నిలిచేవి. లైఫ్ జాకెట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడం నేరంతో సమానం. ఇప్పటికైనా ఇలాంటి వినోద క్రీడల నిర్వహణలో కఠినమైన భద్రతా నియమాలు అమలయ్యేలా చూడాలి.
