Begin typing your search above and press return to search.

బర్రెలక్కకు వచ్చే ఓట్లు ఎన్ని?

ఎన్నికలు.. పార్టీలు.. గెలుపోటముల లెక్కను కాసేపు వదిలేద్దాం. రాజకీయాలకు భిన్నమైన సబ్జెక్టులోకి అలా వెళ్లి ఇలా వద్దాం.

By:  Tupaki Desk   |   1 Dec 2023 4:57 AM GMT
బర్రెలక్కకు వచ్చే ఓట్లు ఎన్ని?
X

ఎన్నికలు.. పార్టీలు.. గెలుపోటముల లెక్కను కాసేపు వదిలేద్దాం. రాజకీయాలకు భిన్నమైన సబ్జెక్టులోకి అలా వెళ్లి ఇలా వద్దాం. ప్రముఖ రియాలిటీ షో.. బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోను చూస్తే.. మారిన పరిస్థితులకు అనుగుణంగా.. సెలబ్రిటీలతో పాటు.. ఒకరిద్దరు సామాన్యుల్ని ఈ షోకు ఎంపిక చేయటం తెలిసిందే. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యే వీరికి.. మిగిలిన సెలబ్రిటీల కంటే కూడా ప్రజల్లో ఆదరణ ఉంటుంది.

వారికి అండగా నిలిచేందుకు ప్రేక్షకులు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ.. టాప్ 5 వచ్చేసరికి వారు ఉండటం కష్టం.. క్లిష్టం. సరిగ్గా ఇలాంటి తీరునే పోలి ఉంటుంది ఎన్నికలు. నిజానికి ఎన్నికలతో పోలిస్తే.. బిగ్ బాగ్ షోలో సామాన్యుల తరఫున ఎంపిక కావటమే కాస్తంత సులువుగా ఉంటుంది. ఎన్నికల వేళ.. ఇండిపెండెంట్లుగా పెద్ద ఎత్తున బరిలోకి దిగుతారు. కానీ.. ఒక ప్రధాన పార్టీ అభ్యర్థికి మించిన ఇమేజ్ ను సొంతం చేసుకోవటం.. ఆమెకు ఆర్థిక సాయం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావటం ఒక మంచి పరిణామంగా చెప్పాలి.

అయితే.. ఇలాంటివారు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. డ్రాయింగ్ రూంలో కూర్చొని నీతివంతమైన రాజకీయాలు లాంటి అంశాల మీద మాట్లాడేవారు.. తమ సందేశాల్ని అదే పనిగా చెప్పేవారు సైతం పోలింగ్ వేళకు.. వారు వేసే ఓటు.. వారి మాటలకు భిన్నంగా ఉండే పరిస్థితి. ఎన్నికల్లో ఓటు వేసే వేళకు.. ఆదర్శాలు.. సిద్ధాంతాల కంటే కూడా మిగిలిన అంశాలు కీలకభూమిక పోషిస్తుంటాయి.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన బర్రెలక్క అలియాస్ శిరీషకు గెలుపు అవకాశాలు ఏ మాత్రం ఉన్నాయన్న దానిపై ఆసక్తికర వాదన వినిపిస్తోంది. నిజానికి ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థి కన్నా.. బీఎస్పీ తరఫున పోటీ చేసినా.. ఆమెకు మరిన్ని ఓట్లు పడేవని చెప్పొచ్చు. పలు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆమెకు పది వేల నుంచి పదిహేను వేల వరకు ఓట్లు పడే వీలుందని చెబుతున్నారు. ఆమెకు పడిన ఓట్ల కారణంగా.. ఎవరి గెలుపు అవకాశాల్ని దెబ్బ తీస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొన్ని సర్వే రిపోర్టుల ఆధారంగా చూస్తే.. అధికార పార్టీ అభ్యర్థి గెలుపు అవకాశాల్ని బర్రెలక్క దెబ్బ తీసే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.