Begin typing your search above and press return to search.

నన్ను ఎవరో పిచ్చి వాడిని చేస్తానని చెవిలో చెబుతున్నారు సార్.. పోలీసుల వద్దకు వింత కేసు!

బారాదరి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ యువకుడు నేరుగా ఇన్‌స్పెక్టర్ ముందు కూర్చుని తన బాధను చెప్పుకున్నాడు.

By:  Tupaki Desk   |   27 May 2025 1:00 PM IST
Bareilly Youth Claims Mysterious Voice in His Ear
X

కొన్నిసార్లు మనం ఊహించని వింత కేసులు పోలీసుల దగ్గరకు వస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్‌లో అలాంటి విచిత్రమైన ఘటనే ఒకటి జరిగింది. ఒక యువకుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనకు ఎదురవుతున్న వింత అనుభవం గురించి చెప్పడంతో అక్కడి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. తన చెవిలో ఎవరో నిరంతరం ఏదో మాట్లాడుతున్నారని, నిద్ర కూడా పట్టడం లేదని ఆ యువకుడు పోలీసులను వేడుకున్నాడు.

బారాదరి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ యువకుడు నేరుగా ఇన్‌స్పెక్టర్ ముందు కూర్చుని తన బాధను చెప్పుకున్నాడు. "నా కుడి చెవిలో ఎవరో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. నేను నిన్ను పిచ్చివాడిని చేస్తాను... చంపేస్తాను.. అని బెదిరిస్తున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని మొదట పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ గొంతు ఎవరిది? ఎవరు మాట్లాడుతున్నారు? అని ఇన్‌స్పెక్టర్ అడిగారు. దానికి ఆ యువకుడు.. తెలియదు సార్, ఎవరూ కనిపించడం లేదు, కానీ ఆ గొంతు మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది అని చెప్పాడు. తాను చాలా రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నానని, ఇంకా తట్టుకోలేకపోతున్నానని యువకుడు వాపోయాడు.

అంతేకాదు, ఆ యువకుడు మరో విచిత్రమైన విషయాన్ని కూడా పోలీసులకు చెప్పాడు. నేను పోలీస్ స్టేషన్ బయట ఉన్నప్పుడు కూడా ఆ గొంతులు వినిపించాయి. కానీ స్టేషన్ లోపలికి రాగానే ఆగిపోయాయని చెప్పాడు. ఇది విని ఇన్‌స్పెక్టర్ కూడా ఏం జరిగిందో అర్థం కాక ఆలోచనలో పడ్డారు. ఆ గొంతులు వినిపించకుండా ఉండటానికి చెవిలో దూది కూడా పెట్టుకున్నానని, అయినా అవి వినిపిస్తూనే ఉన్నాయని యువకుడు తెలిపాడు. ఈ సమస్యతో తాను చాలా రాత్రులు నిద్రపోలేదని, తన ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ యువకుడు తన కుటుంబ పరిస్థితిని కూడా పోలీసులకు చెప్పాడు. "నాకు అమ్మానాన్న లేరు. అక్కాచెల్లెళ్లకు పెళ్లిళ్లయ్యాయి. నేను ఒంటరిగా ఉంటాను. నాతో మాట్లాడేవారు ఎవరూ లేరు. ఇప్పుడు ఈ గొంతులు కూడా నన్ను వదిలిపెట్టడం లేదు" అని కన్నీటి పర్యంతమయ్యాడు. సహాయం కోసం రోదిస్తూ పోలీసులను వేడుకున్నాడు. యువకుడి మాటలను శ్రద్ధగా విన్న ఇన్‌స్పెక్టర్, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. "నీవు మానసికంగా కాస్త ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నావు. మేము నీకు సహాయం చేస్తాం. ముందుగా ఒక మంచి డాక్టర్‌కు చూపించు. అవసరమైతే మేము నిన్ను ఆసుపత్రికి పంపిస్తాం" అని సలహా ఇచ్చారు. ఆ యువకుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బరేలీలోని బారాదరి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఈ కేసు వింతగా అనిపించినప్పటికీ, మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని ఇది తెలియజేస్తుంది.