Begin typing your search above and press return to search.

అమెరికాలో మరో దారుణ విషాదం.. ఈసారి తెలుగు విద్యార్థి!

ఈ విషాదాలు చాలవన్నట్టు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా విద్యార్థి ఆచంట రేవంత్‌ తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

By:  Tupaki Desk   |   3 April 2024 11:10 AM IST
అమెరికాలో మరో దారుణ విషాదం.. ఈసారి తెలుగు విద్యార్థి!
X

అమెరికాలో భారతీయుల వరుస మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుల వ్యవధిలోనే వరుసగా వివిధ ప్రమాదాల్లో లేదా హత్యలకు గురై భారతీయులు మృతిచెందుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫ్లోరిడాలోని ఇండియానా యూనివర్సిటీ పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న పిట్టల వెంకటరమణ అనే తెలుగు విద్యార్థి కొద్ది రోజుల క్రితమే ప్రమాదవశాత్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన తల్లీకూతురు గీతాంజలి, హానిక మృత్యువాత పడ్డారు.

ఈ విషాదాలు చాలవన్నట్టు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా విద్యార్థి ఆచంట రేవంత్‌ తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలనుకున్న అతడి కలలను విధి కర్కశంగా చిదిమేసింది.

మృతుడిది బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడ. రేవంత్‌ తల్లి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. అతడి తండ్రి ఆచంట రఘుబాబు ఫిజియోథెరపిస్టుగా ఉన్నారు.

ఈ క్రమంలో గతేడాది బీటెక్‌ పూర్తి చేసిన ఆచంట రేవంత్‌ 2023 డిసెంబరులో ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. మాడిసన్‌ లోని డకోట స్టేట్‌ యూనివర్సిటీలో అతడు ఎంఎస్‌ చదువుతున్నాడు.

ఈ క్రమంలో భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరాడు. ఆ సమయంలో అతడితోపాటు మరో ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. పొగమంచు కమ్ముకోవడంతో దారి కనిపించకపోవడంతో కారు రోడ్డు మీద నుంచి పక్కకు తప్పుకుని ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో రేవంత్‌ తోపాటు అతడి స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రేవంత్‌ మృత్యువాత పడ్డాడు. దీంతో మృతుడి స్వగ్రామం బోడవాడలో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తమ బిడ్డ మృత్యువాత పడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.