Begin typing your search above and press return to search.

బాంకీపూర్ ఉప ఎన్నిక : నితీన్ నబీన్ Vs ప్రశాంత్ కిషోర్.. ఇద్దరి సత్తాకు అతిపెద్ద పరీక్ష

ఒకవైపు నితీన్ నబీన్, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఉండటంతో ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆకర్షిస్తోంది.

By:  Tupaki Political Desk   |   12 July 2026 2:29 PM IST
బాంకీపూర్ ఉప ఎన్నిక : నితీన్ నబీన్ Vs ప్రశాంత్ కిషోర్.. ఇద్దరి సత్తాకు అతిపెద్ద పరీక్ష
X

బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు నితీన్ నబీన్ సొంత నియోజకవర్గం బాంకీపూర్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా నితీన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరుగుతోంది. నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి జన సురాజ్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) పోటీకి దిగడంతో రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే పీకే రంగంలోకి దిగిన తర్వాత బీజేపీ తన అభ్యర్థిని మార్చివేడయడమే హాట్ టాపిక్ అవుతోంది. ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రశాంత్ కిషోర్ బీజేపీ తనకు భయపడిందని చెప్పుకోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బీజేపీ తొలిసారిగా అభ్యర్థిని మార్చిందంటూ ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని బీజేపీ కొట్టిపడేస్తోంది.

బాంకీపూర్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా తొలుత అభిషేక్ కుమార్ అనే నేతకు టికెట్ ఇచ్చారు. అయితే కుటుంబ వివాదాలు, ఇతర విమర్శలతో అభిషేక్ ను తప్పించి ఆయన స్థానంలో నీరజ్ కుమార్ సిన్హాకు టికెట్ ఇచ్చింది. అయితే ఈ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకున్న ప్రశాంత్ కిషోర్ తనను తట్టుకోలేక బీజేపీ అభ్యర్థిని మార్చిందని ప్రచారం చేసుకోవడం ఆసక్తికర చర్చగా దారి తీసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కచోట గెలవని జనసురాజ్ పార్టీ అధినేత ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో ఈ ఉప ఎన్నికల బరిలో దిగారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గం ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారింది.

ఒకవైపు నితీన్ నబీన్, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఉండటంతో ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. బాంకీపూర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నితీన్ నబీన్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం ఆయన ప్రతిష్టకు పరీక్షగా చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత నియోజకవర్గంలో గెలిచి తన సత్తా నిరూపించుకోవాల్సివుందని అంటున్నారు. మరోవైపు బీజేపీ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరికి కూడా ఈ ఎన్నిక ఒక సవాల్ గా చెబుతున్నారు. ఇదే సమయంలో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ రాజకీయ భవిష్యత్తుగా ఈ ఎన్నిక మరో అవకాశంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలా దేశవ్యాప్తంగా పేరున్న ముగ్గురు నేతలకు బాంకీపూర్ ఉప ఎన్నిక విషమ పరీక్షగా నిలవడమే హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ అభ్యర్థిని మార్చడమే కాకుండా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన తన శక్తియుక్తులు అన్నీ ప్రయోగిస్తున్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను గెలిపించానని చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో చతికిల పడటంపై గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సంస్థాగత బలం లేక ఆ ఎన్నికల్లో ఓడిపోయారని సరిపెట్టుకున్నా, ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నెగ్గలేకపోతే ఆయన వృత్తి జీవితం కూడా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో బాంకీపూర్ ఉప ఎన్నిక ప్రముఖ నేతలకు టెన్షన్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.