పహల్గాం ఎఫెక్ట్: గుజరాత్‌లో మెగా ఆపరేషన్.. వెయ్యి మందికి పైగా అక్రమ వలసదారులు అరెస్ట్!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా భద్రతా దళాలను అప్రమత్తం చేసింది.
By: Tupaki Desk | 26 April 2025 8:30 PM ISTజమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ సరిహద్దుల్లో నిఘాను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా అక్రమంగా చొరబడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో గుజరాత్ పోలీసులు శనివారం తెల్లవారుజామున చేపట్టిన ఒక మెరుపు ఆపరేషన్‌లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో నిర్వహించిన ఈ భారీ తనిఖీల్లో ఏకంగా 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నకిలీ గుర్తింపు పత్రాలు సమర్పించి రాష్ట్రంలోకి చొరబడ్డారని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి స్వయంగా వెల్లడించారు.
హోంమంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్‌లలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో అహ్మదాబాద్‌లో అత్యధికంగా 890 మంది అక్రమ వలసదారులు పట్టుబడగా, సూరత్‌లో 134 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వీరంతా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల ద్వారా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తేలింది. అక్కడ నకిలీ గుర్తింపు పత్రాలు సంపాదించి, దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నట్లు వారు అంగీకరించారు.
ఇటీవల గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన నలుగురు బంగ్లాదేశీయుల్లో ఇద్దరికి అల్‌ఖైదా స్లీపర్ సెల్స్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించడంతో రాష్ట్రంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి ఆదేశాల మేరకు ఈ భారీ స్థాయి ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడిన వారందరి గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, వారిని త్వరలోనే వారి స్వదేశానికి తిప్పి పంపుతామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా గుజరాత్‌లో ఎవరైనా పాకిస్థాన్ జాతీయులు ఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నూతన నిబంధనల ప్రకారం వారు కూడా వెంటనే రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని ఆయన ఆదేశించారు. చట్టవిరుద్ధంగా దేశంలో నివసించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమ వలసదారులు వెంటనే పోలీసులకు లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుజరాత్ పోలీసుల ఈ చర్య రాష్ట్రంలో అక్రమ చొరబాట్లకు పాల్పడే వారికి ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తోంది.