కరెన్సీపైనే కాదు.. గాంధీ, జిన్నా సరసన చోటు కోల్పోయిన బంగ్లా ముజిబుర్
ఆ దేశ ప్రధానిగా ఉన్న అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఉన్నపళాన రాజీనామా చేసి హుటాహుటిన భారత్ కు వచ్చేశారు.
By: Tupaki Desk | 4 Jun 2025 5:31 PM ISTసరిగ్గా 10 నెలల కిందట పొరుగు దేశం బంగ్లాదేశ్ లో తీవ్ర అలజడి చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానిగా ఉన్న అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఉన్నపళాన రాజీనామా చేసి హుటాహుటిన భారత్ కు వచ్చేశారు. బంగ్లా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ పొడిగింపు విషయమై మొదలైన ఆందోళనలకు హింసాత్మక కార్యకలాపాలకు దారితీశాయి. దీంతో హసీనా ప్రభుత్వం పడిపోయింది. ఆమె స్థానంలో బంగ్లాలో నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, కరడుగట్టిన భారత వ్యతిరేకి అయిన యూనస్.. అనేక వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతున్నారు.
తాజాగా బంగ్లాదేశ్ జాతిపితగా షేక్ ముజిబుర్ రెహ్మాన్ (హసీనా తండ్రి) పేరును తొలగించారు. ముజిబుర్ కు బంగ బంధు అనే బిరుదు ఉంది. బంగ్లా స్వాతంత్ర్య ఉద్యమంలో ముజిబుర్ దే ప్రధాన పాత్ర. అందుకని ఆయనను జాతి పితగా గుర్తించారు. భారత జాతిపిత గాంధీ, పాకిస్థాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా సరసన ఇన్నాళ్లూ బంగ్లా జాతిపితగా ముజిబుర్ ను కొలిచేవారు.
అయితే, యూనస్ ప్రభుత్వం హసీనా కుటుంబం చరిత్రను కనుమరుగు చేసేలా కుట్రలు పన్నుతోంది. ముజిబుర్ కు
ఫాదర్ ఆఫ్ నేషన్ (జాతిపిత) బిరుదును తొలగించింది. స్వాతంత్ర్య సమరయోధులు అనే పదానికి కొత్త అర్థం కూడా ఇచ్చింది.
గత నెలలో బంగ్లాదేశ్ కరెన్సీ నుంచి ముజిబుర్ ఫొటోను తీసేసిన సంగతి తెలిసిందే. కొత్త కరెన్సీని విడుదల చేసింది. గమనార్హం ఏమంటే బంగ్లాలో మైనారిటీలైన, ఇరుగుపొరుగున ఉన్న భారత్-మయన్మార్ లో మెజారీటీ మతమైన హిందూ, బౌద్ధ ఆలయాలను కొత్త కరెన్సీపై ముద్రిస్తోంది.
1947లో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు తూర్పు పాకిస్థాన్ పేరిట ఉండేది బంగ్లాదేశ్. అయితే, పాకిస్థాన్ నేతల మితిమీరిన పెత్తనంతో బంగ్లాదేశ్ లో స్వాతంత్ర్య కాంక్ష రగిలింది. దీనికి భారత్ మద్దతు ఇచ్చింది. 1971లో పాకిస్థాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించింది. బంగ్లా స్వాతంత్ర్యం పోరాటంలో ముజిబుర్ పాత్రకు గాను ఆయనను జాతిపిత హోదా పొందారు.
ఇప్పటికే బంగ్లాదేశ్ టెక్ట్స్ బుక్స్ లో ముజిబుర్ గురించి తగ్గించి చెబుతున్నారు. 1971లో బంగ్లా స్వాతంత్ర్య ప్రకటనను పాక్ సైనిక పాలకుడు జియా ఉర్ రెహ్మాన్ చేసినట్లు మార్చారు. ఇది గతంలో ముజిబుర్ రెహ్మాన్ చేసినట్లుగా ఉండేది.
