పాక్ కోసం ప్రాణాలు అర్పిస్తారట.. బంగ్లాదేశ్ కొత్త నాటకం మొదలు!
ప్రస్తుతం మనకు పాకిస్తాన్ తో సరిగా లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వాళ్ల రాగం అందుకుంది.
By: Tupaki Desk | 3 May 2025 7:52 PM ISTప్రస్తుతం మనకు పాకిస్తాన్ తో సరిగా లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వాళ్ల రాగం అందుకుంది. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియా దాడి చేస్తే ఊరుకునేది లేదని బంగ్లాదేశ్‌ను కబ్జా చేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ సలహాదారుడు ప్రకటించారు. ఆయన ఏం చేస్తారంటే, ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటారట. ఆయన మాజీ ఆర్మీ చీఫ్ కూడా. ఈయన మాటలు వింటుంటే, బంగ్లాదేశ్‌ను కూడా మన లిస్టులో వేసుకోవాల్సిన టైమ్ వచ్చిందనిపిస్తోంది.
ఒకప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడటానికి పాకిస్తాన్‌ను ఇండియా ఓడించింది. వాళ్లకు స్వాతంత్ర్యం ఇచ్చింది కూడా మనమే. కానీ ఇప్పుడు చూస్తే, మన మీదే కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. పొరుగు దేశం అని మనం స్నేహంగా ఉంటే వాళ్లేమో రెచ్చిపోతున్నారు. సొంత దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని చక్కదిద్దుకోలేని వాళ్లు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తరిమేసి, ఎవరి మద్దతు లేని వాళ్లు పాలన చేస్తున్నారు. వాళ్లే దేశ భవిష్యత్తును డిసైడ్ చేస్తారట.
బంగ్లాదేశ్‌లో ఉన్న ఈ అప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి, మళ్లీ అక్కడ హసీనా ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇండియా సాయం చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అభివృద్ధి చెందాల్సిన బంగ్లాదేశ్‌ను వాళ్లే స్వయంగా నాశనం చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కోసం మన మీద యుద్ధానికి వస్తారట. వీళ్లకు సరైన బుద్ధి చెప్పాల్సిన టైమ్ వచ్చిందని జనాలు కామెంట్లు పెడుతున్నారు.
నిజమే మరి.. కానీ ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అంత బాగాలేవు. అక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బలవంతంగా తొలగించి, సైనిక పాలన కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడటం, ఇండియాపై బెదిరింపులకు దిగడం చూస్తుంటే, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏదో తప్పుదారిలో వెళ్తోందనిపిస్తోంది.
బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ మాటలు చూస్తుంటే ఆయనకు అంతర్జాతీయ సంబంధాలపై సరైన అవగాహన లేదనిపిస్తోంది. ఇండియాపై దాడి చేయడం అంత సులువేమీ కాదు. పైగా, ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం వల్ల బంగ్లాదేశ్‌కే నష్టం జరుగుతుంది. ఇండియా, బంగ్లాదేశ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకు దిగితే, ఆ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆలోచించి ఇండియాపై బెదిరింపులు మానుకుని తమ దేశంలోని రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. లేకపోతే వాళ్లే నష్టపోతారు.
