యుద్ధం ఎఫెక్ట్ : బంగ్లాదేశ్‌లో ఇంధన హాహాకారం.. ఫిలిప్పీన్స్‌లో 'ఎనర్జీ ఎమర్జెన్సీ'
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను ఇంధన సంక్షోభం వైపు నెడుతున్నాయి.
By: A.N.Kumar | 24 March 2026 11:39 PM ISTపశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను ఇంధన సంక్షోభం వైపు నెడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా ఖండంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణంగా బంగ్లాదేశ్‌లో పెట్రోల్ బంకులు మూతపడటం.. ఫిలిప్పీన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించడం వంటి పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.
బంగ్లాదేశ్‌లో ఇంధన హాహాకారం
బంగ్లాదేశ్‌లో ఇంధన కొరత ఊహించని స్థాయికి చేరుకుంది. రాజధాని ఢాకాతో పాటు చిట్టగాంగ్ వంటి ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఆయిల్ కంపెనీల నుండి సరఫరా నిలిచిపోవడంతో వందలాది పెట్రోల్ బంకులు బోర్డులు తిప్పేస్తున్నాయి. తెరిచి ఉన్న అతికొద్ది బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు వేచి ఉన్నాయి. గంటల తరబడి వేచి ఉన్నా ఇంధనం దొరుకుతుందన్న గ్యారెంటీ లేకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ కొరత కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బస్సులు, లారీలు రోడ్ల పక్కన నిలిచిపోయాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల సరఫరా దెబ్బతిని, ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫిలిప్పీన్స్‌లో 'ఎనర్జీ ఎమర్జెన్సీ'
పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం దేశంలో 'ఎనర్జీ ఎమర్జెన్సీ' విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిలిప్పీన్స్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 98% పర్షియన్ గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతుంది. యుద్ధం వల్ల అక్కడ రవాణా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో దేశీయంగా నిల్వలు అట్టడుగుకు చేరుకున్నాయి. ఈ అత్యవసర పరిస్థితి సుమారు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కాలంలో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉండటమే కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేయనుంది. ఇంధన ధరల పెరుగుదల నుంచి సామాన్యులను రక్షించడం.. విద్యుత్ గ్రిడ్ పతనం కాకుండా చూడటమే ఈ ఎమర్జెన్సీ ప్రధాన ఉద్దేశ్యం.
ఆస్ట్రేలియాపై కూడా ప్రభావం
విచిత్రంగా సంపన్న దేశమైన ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంధన కొరత ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విక్టోరియా, క్వీన్స్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాల్లోని వందలాది పెట్రోల్ స్టేషన్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం.. సరఫరాలో జాప్యం జరగడమే ఇందుకు కారణం.
యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు
పశ్చిమాసియా అనేది ప్రపంచానికి ఇంధన భాండాగారం. అక్కడ యుద్ధం కొనసాగితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటగా.. మరింతే పెరిగే అవకాశం ఉంది. దిగుమతులపై ఆధారపడే దేశాల విదేశీ మారక నిల్వలు కరిగిపోతుండటంతో శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభాలు తలెత్తే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కేవలం ఇంధన కొరత మాత్రమే కాదు.. ఇది ప్రపంచ దేశాల భద్రత.. ఆర్థిక స్థిరత్వానికి సవాలుగా మారింది. యుద్ధం త్వరగా ముగిసి సరఫరా గొలుసు పునరుద్ధరించబడకపోతే ఆసియాలోని మరిన్ని దేశాలు చీకట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
