Begin typing your search above and press return to search.

ఇంట్రస్టింగ్... బంగ్లాదేశ్ ఎన్నికల్లో 'కూటమి' పథకాలు!

భారతీయ ఎన్నికల్లో ఉచిత హామీలు, మహిళా కేంద్రీకృత పథకాలు ఎంత కీలక భూమిక పొషిస్తాయనేది తెలిసిన విషయమే.

By:  Raja Ch   |   10 Feb 2026 10:00 PM IST
ఇంట్రస్టింగ్... బంగ్లాదేశ్  ఎన్నికల్లో కూటమి పథకాలు!
X

భారతీయ ఎన్నికల్లో ఉచిత హామీలు, మహిళా కేంద్రీకృత పథకాలు ఎంత కీలక భూమిక పొషిస్తాయనేది తెలిసిన విషయమే. ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు పథకం హామీ ఇచ్చిన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు విజయం సాధించిన పరిస్థితి! ఇది మచ్చుకు ఒక ఉమ్మడి ఉదాహరణ మాత్రమే! ఈ సమయంలో.. ఫిబ్రవరి 12న జరగనున్న అత్యంత కీలక ఎన్నికల్లో బంగ్లాదేశ్ లోని రాజకీయ పార్టీలు భారత్ లోని ఎన్డీయే కూటమి ఇచ్చిన పలు హామీలను గుర్తుకు తెస్తున్నాయనే చర్చ జరుగుతుంది!

అవును... భారతీయ సంక్షేమ రాజకీయాల పుస్తకం నుంచి బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలు పలు అంశాలను అరువు తెచ్చుకున్నాయా, కాపీ కొట్టాయా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇప్పుడు ఇక్కడ ధ్వనించి సక్సెస్ అయిన పథకాలు అక్కడా వినిపిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో ఆ దేశంలో జరగబోయే అత్యంత కీలక ఎన్నికలుగా చెబుతున్నా ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన తారిక్ రెహమాన్ "బీ.ఎన్.పీ", జమాత్-ఇ-ఇస్లామీ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పలు కీలక హామీలు పొందుపరిచాయి.

ఇందులో భాగంగా... ఆరోగ్య సంరక్షణ, సబ్సిడీ ధరల్లో గృహ నిర్మాణాలు, మహిళలకు నగదు బదిలీ, అధికారంలోకి వస్తే మహిళలకు మంత్రివర్గంలో పెద్ద పీట, కిసాన్ క్రెడిట్ కార్డు, స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకం వంటివి దర్శనమిస్తుండటం ఆసక్తిగా మారింది. ఇవన్నీ గత ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ప్రధానంగా ఏపీలో ఇచ్చిన హామీలు కావడం గమనార్హం! ఇందులో మెజారిటీ భారతదేశ హామీలను గుర్తుచేసే వాగ్ధానాలు బీ.ఎన్.పీ మ్యానిఫెస్టోలో దర్శనమిస్తున్నాయని అంటున్నారు!

ముందుగా జమాతీ-ఇ-ఇస్లామీ పార్టీ ఎన్నికల హామీల విషయానికొస్తే... భారత్ లోని 'ఆయుష్మాన్ భారత్' పథకం గుర్తుకు వచ్చేలా... సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, పేదలకు ఉచిత అధునాతన చికిత్స ఉన్నాయి. ఇదే క్రమంలో... ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని గుర్తు చేసేలా... అల్ప, మధ్య ఆదాయం ఉన్న కుటుంబాలకు సబ్సిడీ ధరల్లో గృహ నిర్మాణాల పథకాన్ని జమాతీ-ఇ-ఇస్లామీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ఇక ప్రధానంగా ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన తారిక్ రెహమాన్ బీ.ఎన్.పీ. పార్టీ హామీల విషయానికొస్తే... ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన "ప్రతీ మహిళకు నెలకు రూ.1,500" పథకాన్ని గుర్తుకు తెచ్చేలా నెలకు మహిళలకు రూ.2,000 అందించే పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇది సుమారు 50 లక్షల మంది మహిళలను కవర్ చేస్తుందని చెబుతున్నారు.

ఇదే సమయంలో భారత్ లోని "కిసాన్ క్రెడిట్ కార్డ్" తరహాలోనూ బీ.ఎన్.పీ. బంగ్లాదేశ్ రైతులకు "రైతు కార్డు" వ్యవస్థ హామీని ఇచ్చింది. అదేవిధంగా భారత్ లోని విద్యారంగంలో "మధ్యాహ్న భోజనం" కార్యక్రమాన్ని గుర్తు చేసేలా... బంగ్లాదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉచిత మధ్యాహ్న భోజన పథకం హామీని బీ.ఎన్.పీ. ఇచ్చిందని తెలుస్తోంది! దీంతో... ఈ ఎన్నికల హామీలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.