ఎన్నికలు బంగ్లాదేశ్ లో, చూపు పక్క దేశాల్లో.. కారణం క్లియర్!
బీ.ఎన్.పీ అధినేత తారిఖ్ రెహమాన్.. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు కాగా.. ఆమె డిసెంబర్ 2025లో మరణించారు.
By: Raja Ch | 12 Feb 2026 2:18 PM ISTఈ రోజు (ఫిబ్రవరి 12) బంగ్లాదేశ్ దేశ చరిత్రలో ఓ కీలకమైన రోజు కాబోతుందని చెప్పొచ్చు. కారణం.. 2024 ఆగస్టులో ప్రధానమంత్రి షేక్ హసీనా పదవీచ్యుతులైన అనంతరం.. సుమారు 12.7 కోట్ల మంది ప్రజలు తమ మొదటి ప్రభుతాన్ని ఎన్నుకుంటున్నారు. అందువల్లే 1971లో ఆ దేశం ఏర్పడినప్పుడు ఎంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో.. ఈ ఎన్నికకు అంతే ప్రాముఖ్యత ఉందని అంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలపై భారత్, పాక్ లు దృష్టిసారించడం గమనార్హం.
అవును... బంగ్లాదేశ్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నేడు నాంది పలుకుతోంది! పైగా ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్న సుమారు 127 మిలియన్ల మంది ఓటర్లలో దాదాపు 44శాతం మంది 18 నుంచి 36 సంవత్సరాలలోపు వారు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ), జమాత్-ఇ-ఇస్లామి (జేఈఐ) మధ్య నడుస్తుందని అంటున్నారు. దీంతో.. ఎవరు గెలిస్తే ఏమి జరగనుందనేది ఆసక్తిగా మారింది.
బీ.ఎన్.పీ అధినేత తారిఖ్ రెహమాన్.. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు కాగా.. ఆమె డిసెంబర్ 2025లో మరణించారు. ఇటీవల బంగ్లాదేశ్ కు వచ్చిన ఆయన పార్టీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో కేడర్ కు కీలక దిశానిర్ధేశం చేశారు. ఇటీవల ఓ సభలో మాట్లాడిన తారిఖ్ రెహమాన్... పొరుగుదేశాలతో కలిసి సంబంధాలను పునరుద్దరించుకోవడానికి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈయన ఉన్నంతంలో భారత్ అనుకూలి అనే చర్చ నడుస్తోంది!
మరోవైపు... జమాతే-ఇ-ఇస్లామీకి షఫీకర్ నాయకత్వ వహిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేక నాయకులు ఏర్పాటు చేసిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్.సీ.పీ)తో సహా 11 పార్టీల కూటమికి ఈయన అధిపతిగా ఉన్నారు. గతంలో ఈయనను ఉగ్రవాదం, విధ్వంసం నేరాల కింద హసీనా సర్కార్ జైల్లో పెట్టగా.. యూనస్ పరిపాలనలో బయటపడిపోయారు! ఈ క్రమంలో ఈ కుటమి గెలిస్తే ఇది పూర్తిగా పాక్ బానిసగా పనిచేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
కాగా... మొత్తం 350 సీట్లు కలిగిన ది నేషనల్ సంసద్ (ఆ దేశ పార్లమెంట్)లో ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రజలతో ఎన్నుకోబడిన 300 మంది సభ్యులతో పాటు.. ఈ 300 మందితో ఎన్నుకోబడిన మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన 50 సీట్లు ఉన్నాయి. ఈ ఏకసభ్య శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 151! కాగా.. నేడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రేపు (ఫిబ్రవర్ 13న) విడుదలవుతాయని అంటున్నారు!
బంగ్లా ఎన్నికలపై భారత్ దృష్టి ఎందుకు..!?:
బంగ్లాదేశ్ అనేది భారత్ కు కేవలం ఓ పొరుగుదేశం మాత్రమే కాదు. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో తమ సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. సరిహద్దు భద్రత విషయంలో ఇది అనివార్యమైన పాత్ర పోషిస్తుంది! వాస్తవానికి.. బంగ్లాదేశ్ లో ఉన్న భారత వ్యతిరేక తిరుగుబాటుదారులను ఆమె పాలనలో అణిచివేయడానికి షేక్ హసీనా సహాయపడ్డారు. ఈ నేపథ్యంలో... ఈ ఎన్నికల ఫలితాలు ఓ విధంగా భారత్ తదుపరి కీలక నిర్ణయాలకు ముఖ్యమైనవని అంటున్నారు!
మరోవైపు... ఈ ఎన్నికల్లో జమాత్ గెలిస్తే.. యూనస్ నాయకత్వంలో బలపడటం మొదలుపెట్టిన పాక్ - బంగ్లా దౌత్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని.. ఇవి ఆందోళన కలిగించేవని అంటున్నారు. పైగా జమాత్ ను పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ.కి తొత్తుగా పరిగణిస్తారు. పైగా సుమారు 14 ఏళ్ల తర్వాత ఈ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు తిరిగి ప్రారంభించబడ్డాయి. బీ.ఎన్.పీ. అధికారంలోకి వస్తే పాక్ కంటే భారత్ వైపే ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు.
