Begin typing your search above and press return to search.

కరెన్సీని మార్చేసిన మన పక్క దేశం.. మాజీ ప్రధానిపై కోపమే కారణం!!

బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం కరెన్సీ విషయంలో కీలక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా... కొత్త డిజైన్ తో ఉన్న కరెన్సీ నోట్లను విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 9:23 AM IST
కరెన్సీని మార్చేసిన మన పక్క దేశం.. మాజీ ప్రధానిపై కోపమే కారణం!!
X

దేశాలు వాటి వాటి కరెన్సీ నోట్లలో మార్పులు చేర్పులు చేయడం సహజమే! కాకపొతే అది కాస్త ఖర్చుతో కూడుకున్న పని అని అంటారు! మోడీ సర్కార్ భారత్ లోనూ ఈ పని చేసింది. ఈ క్రమంలో తాజాగా బంగ్లాదేశ్ తన కరెన్సీలో మార్పులు చేసింది. ఇందులో భాగంగా నోట్లపై ఫోటోలు మార్చింది. దీంతో... ఈ నిర్ణయం షేక్ హసీనా కోసమే అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును.... బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం కరెన్సీ విషయంలో కీలక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా... కొత్త డిజైన్ తో ఉన్న కరెన్సీ నోట్లను విడుదల చేసింది. ఈ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాల ఫోటోలను ముద్రించింది. జూన్ 1వ తేదీ నుంచి కొత్త నోట్ల జారీ మొదలుపెట్టింది. అయితే.. పాతనోట్లపై ఉన్న మాజీ ప్రధాని ముజిబుర్ ఫోటోను అన్ని నోట్ల మీదా తొలగించడం గమనార్హం!

ఈ సందర్భంగా స్పందించిన బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి... కొత్త డిజైన్ ప్రకారం కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు ఉండవని.. వీటికి బదులుగా ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాల చిత్రాలే ఉంటాయని తెలిపారు. వీటితో పాటు దివంగత చిత్రకారుడు జైనుల్ అబెదిన్ గీసిన కళాఖండాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 9 డిజైన్ లను రూపొందించినట్లు వెల్లడించారు.

కాగా... 1971లో పాకిస్థాన్ - భారత్ యుద్ధం అనంతరం బంగ్లాదేశ్ ఏర్పడిన సంగతి తెలిసిందే! దీంతో.. 1972లో బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్ ను ముద్రించారు. అనంతరం ముజిబుర్ రెహ్మాన్ చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశారు. ఆయనే.. షేక్ హసీనా తండ్రి! గతేడాది ఆగస్టులో హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన అనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత కొలువుదీరిన తాత్కాలిక ప్రభుత్వం ఆమె తండ్రి ఉన్న ఫోటోను కొంతకాలం కొనసాగించింది! ఈ నేపథ్యంలో తాజాగా ఇకపై వాటిని కొనసాగించొద్దని నిర్ణయించుకుని.. కొత్త నోట్లపై షేక్ హసీనా తండ్రి, ముజిబుర్ రెహ్మాన్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై తొలగించింది.

షేక్ హసీనాపై మరో నేరాభియోగం!:

దేశం విడిచి వెళ్లిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు చేశారు. ఇందులో భాగంగా... 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె క్రూరంగా అణిచివేయాలని చూశారని.. సామాన్య పౌరులపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు. ఈ మేరకిఉ భద్రతా దళాలకు ఆమె నేరుగా ఆదేశించినట్లు గుర్తించామని అన్నారు!

ఈ సందర్భంగా స్పందించిన చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం... విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధాని భద్రతా దళాలు, తన పార్టీ సభ్యులకు నేరుగా ఆదేశాలు జారీ చేశారని.. వీటికి సంబంధించిన ఎన్ క్రిప్టెడ్ కమ్యునికేషన్లు, వీడియో ఆధారాలు ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించి 81మంది సాక్షులుగా ఉన్నారని తెలిపారు.