Begin typing your search above and press return to search.

బంగ్లాలో మరో తిరుగుబాటు.. సైన్యం Vs యూనస్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ తాత్కాలిక సారథి మొహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ వకర్‌-ఉజ్‌ జమాన్‌ మధ్య విభేదాలు తలెత్తినట్లు కథనాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 May 2025 1:45 PM IST
బంగ్లాలో మరో తిరుగుబాటు.. సైన్యం Vs యూనస్
X

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ తాత్కాలిక సారథి మొహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ వకర్‌-ఉజ్‌ జమాన్‌ మధ్య విభేదాలు తలెత్తినట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు చెబుతున్నారు. దీనంతటికి ప్రధాన కారణం బంగ్లాలో ఎన్నికలు లేకుండానే తన ప్రభుత్వాన్ని కొనసాగించాలని యూనస్ భావిస్తుండగా, ఈ ఏడాది డిసెంబరులోగా ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపించాలని ఆర్మీ కోరుకోవడమేనంటున్నారు.

ఈ నేపథ్యంలో ముందు సంస్కరణలు ఆ తర్వాతే ఎన్నికలు అంటూ యూనస్ మద్దతుదారులు ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఆర్మీ ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఏ క్షణంలో ఏమవుతుందనే టెన్షన్ ఎక్కువవుతున్నట్లు చెబుతున్నారు. తాత్కాలిక సారథి యూనస్ ఐదేళ్లపాటు పదవిలో కొనసాగాలని భావించడంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ లో సంక్షోభం నెలకొనే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.

కాగా, డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్‌ వకర్‌-ఉజ్‌ జమాన్‌ ఇచ్చిన పిలుపునిచ్చిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని యూనస్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు యూనస్ ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఆయనే ప్రధానిగా కొనసాగాలని కోరుతున్నవారు ఆందోళనలు చేస్తున్నారు.

దేశంలో నిరుద్యోగ సమస్యపై మొదలైన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా తప్పుకోవాల్సివచ్చింది. ఉన్నపళంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆర్మీ సహకారంతో తాత్కాలిక ప్రధానిగా యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో ఎన్నికల నిర్వహణకు పూనుకోవడంతో ఆయన మద్దతుదారులు మరో ఉద్యమాన్నికి తెరలేపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగలేనని, మరో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని విద్యార్థి నాయకులే ఏర్పాటు చేసుకోవాలని యూనస్‌ కోరినట్లు బంగ్లాదేశ్‌ దినపత్రిక ప్రొథోమ్‌ తెలిపింది.