బ్యాంకాక్ పబ్‌లో ఘోరం.. 27 మంది దుర్మరణం.. ఊపిరాడక మరుగుదొడ్లలోనే ప్రాణాలు విడిచారు
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షించే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆదివారం అర్థరాత్రి ఒక పెను విషాదం చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 13 July 2026 11:55 AM ISTప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షించే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆదివారం అర్థరాత్రి ఒక పెను విషాదం చోటుచేసుకుంది. నైట్‌లైఫ్, వినోద కేంద్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ నగరంలోని ఒక ప్రముఖ పబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం 27 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా పర్యాటకంగా ఎంతో మంది వెళ్లే భారతీయుల్లోనూ ఇప్పుడు ఆందోళన మొదలైంది.
ఊపిరాడక మరుగుదొడ్లలోనే ప్రాణాలు విడిచారు!
బ్యాంకాక్‌లోని చాటుచాక్ జిల్లాలో ఉన్న ఒక పాపులర్ బీర్ పబ్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి కావడంతో పబ్ కస్టమర్లతో కిక్కిరిసిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్నవారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు దిక్కుతోచని స్థితిలో పరుగులు తీశారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో కొందరు పబ్ లోపల ఉన్న మరుగుదొడ్లలోకి వెళ్లి ప్రాణాలు దాచుకునే ప్రయత్నం చేశారు. అయితే దట్టమైన పొగ , విషవాయువులు పబ్ అంతటా కమ్ముకోవడంతో, ఊపిరాడక వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు థాయ్ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతానికి 27 మంది మృతి చెందినట్లు నిర్ధారణ కాగా గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ పర్యాటకుల గుర్తింపు.. రంగంలోకి ఆస్ట్రేలియా
బ్యాంకాక్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కావడంతో ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రమాద వార్త తెలియగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదంలో తమ దేశ పౌరులు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు థాయ్‌లాండ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
భారతీయుల పరిస్థితి ఏంటి?
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయ పర్యాటకులు బ్యాంకాక్‌ను సందర్శిస్తుంటారు. అందువల్ల ఈ ప్రమాదంలో భారతీయులు ఎవరైనా చిక్కుకున్నారా అనే ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ ఘోర ప్రమాదంలో భారతీయులు ఎవరైనా మృతి చెందినట్లు లేదా గాయపడినట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం కానీ భారత విదేశాంగ శాఖ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. క్షతగాత్రులు, మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక భద్రతా ప్రమాణాల లోపం ఏమైనా ఉందా? అనే కోణంలో థాయ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పబ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
