Begin typing your search above and press return to search.

బ్యాంకాక్ మార్కెట్ లో సామూహిక కాల్పులు... మృతుల వివరాలివే!

ఇదే క్రమంలో తాజాగా థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ లో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని.. మృతి చెందాడు.

By:  Tupaki Desk   |   28 July 2025 5:15 PM IST
బ్యాంకాక్ మార్కెట్ లో సామూహిక కాల్పులు... మృతుల వివరాలివే!
X

మానసిక పరిస్థితి బాగోలేకో.. లేక, లక్ష్యాలు వేరే ఉండో తెలియదు కానీ... ఇటీవల కాలంలో సామాన్య ప్రజానికంపై కత్తులతోనూ, తుపాకీలతోనూ విరుచుకుపడుతున్న దుండగుల ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి అమెరికాలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఓ దుండగుడు కత్తితో బీభత్సం సృష్టించగా.. తాజాగా బ్యాంకాక్ లో మరో దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు.

అవును... శనివారం మిచిగాన్‌ ట్రావర్స్ సిటీలోని వాల్‌ మార్ట్‌ స్టోర్‌ లో ఓ దుండగుడు కత్తితో బీభత్సం సృష్టించీగా.. ఆ ఘటనలో 11 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ లో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని.. మృతి చెందాడు.

స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం... బ్యాంకాక్‌ లోని ఓర్ టు కో మార్కెట్‌ లోకి ఓ సాయుధుడు చొరబడ్డాడు. ఈ క్రమంలో ఉన్నపలంగా కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. ఈ కాల్పుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళ మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు.

అనంతరం.. దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దీంతో... రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా... ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్‌ సమీపంలో ఈ ఘటన జరగడంతో స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. మరోవైపు థాయిలాండ్‌ - కంబోడియా సరిహద్దుల వద్ద జరుగుతున్న ఘర్షణలతో ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని కాంగ్ జిల్లాకు చెందిన 61 ఏళ్ల మాజీ సెక్యూరిటీ గార్డుగా గుర్తించారని సమాచారం.