బెంగళూరు స్టార్టప్ వ్యథలు : ₹92 లక్షల జీతం… అయినా ఉద్యోగ భద్రత లేదు
గత కొన్నేళ్లుగా 'ఫండింగ్ వింటర్' అనే పెట్టుబడుల కొరత స్టార్టప్ రంగాన్ని వెంటాడుతోంది. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడం, తక్షణ లాభాలను ఆశించడం వంటి కారణాలతో కంపెనీలు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
By: A.N.Kumar | 5 March 2026 8:00 AM ISTభారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరం ఒకప్పుడు కలల సౌధాలకు నిలయం. లక్షల రూపాయల ప్యాకేజీలు, అత్యాధునిక ఆఫీస్ సౌకర్యాలు, వేగవంతమైన వృద్ధి.. ఇవన్నీ యువ టెక్కీలను అయస్కాంతంలా ఆకర్షించేవి. కానీ నేడు అదే నగరం నుంచి వస్తున్న వార్తలు స్టార్టప్ ప్రపంచంలోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా ఒక స్టార్టప్ సంస్థలో జరిగిన సామూహిక తొలగింపులు.. ముఖ్యంగా ₹92 లక్షల వార్షిక వేతనం ఉన్న వ్యక్తి కూడా నిరుద్యోగిగా మారడం పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అధిక వేతనం.. అల్ప భద్రత.. ఒక వైరుధ్యం
సాధారణంగా మధ్యతరగతి ఆలోచనా ధోరణిలో ఒక భావన బలంగా ఉంటుంది. ఎక్కువ జీతం ఉంటే ఆ ఉద్యోగి సంస్థకు అత్యంత అవసరమైన వ్యక్తి అని.. వారికి భద్రత ఎక్కువగా ఉంటుందని.. కానీ ప్రస్తుత స్టార్టప్ సంస్కృతి ఈ సూత్రాన్ని తలకిందులు చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్ అర్పిత్ గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు కంపెనీ తన మొత్తం సిబ్బందిలో 40 శాతం మందిని ఒక్క రోజులోనే తొలగించింది. ఇందులో ₹92 లక్షల భారీ ప్యాకేజీ తీసుకుంటున్న సీనియర్ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినప్పుడు మొదటగా వేటు పడేది భారీ జీతాలు తీసుకునే వారిపైనే. ఒక సీనియర్ ఉద్యోగిని తొలగించడం ద్వారా కంపెనీకి మిగిలే బడ్జెట్, నలుగురు జూనియర్ల జీతంతో సమానం కావచ్చు. ఫలితంగా అనుభవం, ప్రతిభ ఉన్నప్పటికీ, ఆర్థిక లెక్కల ముందు మానవ వనరులు కేవలం 'సంఖ్యలు'గానే మిగిలిపోతున్నాయి.
మానవీయ కోణం మృగ్యం
ఈ తొలగింపుల ప్రక్రియలో అత్యంత విచారకరమైన అంశం ఏమిటంటే సంస్థలు ఉద్యోగుల వ్యక్తిగత పరిస్థితులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం... ఒక ఉద్యోగి తండ్రి కావడానికి కేవలం కొన్ని రోజుల సమయం ఉండగా ఉద్వాసనకు గురయ్యాడు. మరో ఉద్యోగిని గర్భవతి అని తెలిసి కూడా, మేటర్నిటీ లీవ్ దరఖాస్తు చేసుకునే లోపే తొలగించారు. ఇలాంటి చర్యలు కార్పొరేట్ ప్రపంచంలో మానవీయ విలువలు ఏ స్థాయిలో పతనమవుతున్నాయో సూచిస్తున్నాయి. కేవలం లాభనష్టాల బేరీజులో పడి.. ఒక మనిషి జీవితాన్ని వారి కుటుంబ భవిష్యత్తును రోడ్డున పడేయడం సమర్థనీయం కాదు. ఇది కేవలం ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు.. నైతిక సంక్షోభం కూడా.
– స్టార్టప్ బుడగ పగిలిపోతోందా?
గత కొన్నేళ్లుగా 'ఫండింగ్ వింటర్' అనే పెట్టుబడుల కొరత స్టార్టప్ రంగాన్ని వెంటాడుతోంది. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడం, తక్షణ లాభాలను ఆశించడం వంటి కారణాలతో కంపెనీలు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా ఎగిరిన స్టార్టప్‌లు నేడు నేల చూపులు చూస్తున్నాయి. వ్యాపార నమూనాలో లోపాలు, మార్కెట్ అనిశ్చితి మధ్య ఉద్యోగులు బలిపశువులుగా మారుతున్నారు.
ఉద్యోగులు నేర్చుకోవాల్సిన పాఠం
ఈ బెంగళూరు ఘటన ఐటీ, స్టార్టప్ రంగాల్లో ఉన్న వారందరికీ ఒక మేలుకొలుపు. ప్రస్తుత కాలంలో ఏ ఉద్యోగమూ శాశ్వతం కాదు.. ఏ ప్యాకేజీ కూడా భద్రతకు గ్యారెంటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. కనీసం ఆరు నెలల నుండి ఏడాది పాటు జీతం లేకపోయినా ఇల్లు గడిచేలా 'ఎమర్జెన్సీ ఫండ్' ఏర్పాటు చేసుకోవాలి. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా ఉండటం శ్రేయస్కరం.
కంపెనీలు కూడా తమ బ్రాండ్ విలువ కేవలం లాభాల మీదనే కాకుండా ఉద్యోగుల పట్ల చూపే గౌరవం మీద కూడా ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. ప్రతిభావంతులైన ఉద్యోగులే ఏ సంస్థకైనా అసలైన ఆస్తులు. వారిని కష్టకాలంలో ఆదుకోలేనప్పుడు, సదరు సంస్థ ఎంతటి గొప్ప సాంకేతికతను కలిగి ఉన్నా అది విఫలమైనట్టే లెక్క.
