Begin typing your search above and press return to search.

స్వీట్ షాప్‌లో దారుణం.. మహిళల టాయిలెట్‌లో సీక్రెట్ కెమెరా కలకలం!

ఆ సమయంలో ఎవరో సీక్రెట్ గా పెట్టిన కెమెరాలో తను రికార్డు అయినట్లు ఆరోపించింది.

By:  Tupaki Desk   |   10 May 2025 12:16 PM IST
స్వీట్ షాప్‌లో దారుణం.. మహిళల టాయిలెట్‌లో సీక్రెట్ కెమెరా కలకలం!
X

బెంగళూరులో జరిగిన ఈ దారుణమైన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఎంతో నమ్మకంగా వెళ్లే కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి నీచమైన పనులు జరుగుతుంటే మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. తాజాగా కోరమంగళలోని ప్రముఖ ఆనంద్ స్వీట్స్ అండ్ సావరీస్ అవుట్‌లెట్‌లో ఒక మహిళ టాయిలెట్‌కు వెళ్లగా అక్కడ ఊహించని భయంకరమైన అనుభవం ఎదురైంది. ఎవరో దుర్మార్గుడు రహస్యంగా మొబైల్ ఫోన్‌ను అమర్చి ఆమెను చిత్రీకరించాడు. ఈ విషయం బయటపడటంతో కేఫ్ సిబ్బంది స్పందించిన తీరు మరింత కలవరపెడుతోంది. అసలేం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన ఒక మహిళ తాను ఏప్రిల్ 25న కోరమంగళలోని ఆనంద్ స్వీట్స్ అండ్ సావరీస్ అవుట్‌లెట్‌లోని మహిళల టాయిలెట్‌ కు వెళ్లినట్లు తెలిపింది. ఆ సమయంలో ఎవరో సీక్రెట్ గా పెట్టిన కెమెరాలో తను రికార్డు అయినట్లు ఆరోపించింది. ఆమె ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోలో టాయిలెట్ దగ్గర ఫైబర్‌గ్లాస్, చెక్క పలకల వెనుక ఒక దాచిన మొబైల్ ఫోన్‌ను కనుగొన్నట్లు తెలిపింది. ఆ పరికరం కదులుతున్నట్లు కనిపించింది. అంటే అది యాక్టివ్ గా రికార్డ్ చేస్తోందని అర్థం.

ఆ మహిళ వెంటనే తన స్నేహితురాలిని అప్రమత్తం చేసి సిబ్బందిని నిలదీసింది. మొదట్లో సిబ్బంది తటపటాయించినప్పటికీ యాజమాన్యం CCTV ఫుటేజ్‌ను పరిశీలించింది. అందులో ఒక సెక్యూరిటీ గార్డు నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడం, ఆ తర్వాత మరొక ఉద్యోగి ఆవరణను విడిచి వెళ్లడం కనిపించింది.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 9:10 గంటలకల్లా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒక థర్డ్-పార్టీ ఏజెన్సీకి టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మొదట్లో తనే చేసినట్లు నిరాకరించినప్పటికీ పోలీస్ స్టైల్ చూపించే సరికి నేరం అంగీకరించాడు.

తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తే సిబ్బంది, ప్రతినిధులు చట్టపరమైన చర్య తీసుకోకుండా ఉండమని ఒత్తిడి తెచ్చారని మహిళ ఆరోపించింది. ఆమె FIR దాఖలు చేసి, యాజమాన్యం బాధ్యతను ఒక కాంట్రాక్టర్‌పైకి నెట్టడం, తన మానసిక క్షోభను పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పించింది.

ఆ తర్వాత ఆనంద్ స్వీట్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ ఘటనను ఖండించింది. నిందితుడు తమ ఉద్యోగి కాదని, కాంట్రాక్ట్ టెక్నీషియన్ అని ధృవీకరించింది. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా మహిళా టాయిలెట్ అటెండెంట్లు, మేనేజర్‌లను నియమించడం, అలాగే ప్రతిరోజూ తనిఖీలు చేయడం వంటి కొత్త భద్రతా ప్రోటోకాల్‌లను ప్రకటిచింది.ఈ ఘటన ఆన్‌లైన్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. చాలా మంది కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.