Begin typing your search above and press return to search.

కేటీఆర్ పై విరుచుపడిన బండ్ల... ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని ప్రార్ధన!

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా.. బీఆరెస్స్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   25 Jan 2024 7:41 AM GMT
కేటీఆర్ పై విరుచుపడిన బండ్ల... ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని ప్రార్ధన!
X

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా.. బీఆరెస్స్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మరో పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, మీరే సీఎం కావాలనుకుంటే వేరే రాష్ట్రాలకు వెళ్లి పోటీ చేయండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రేవంత్ కి బీఆరెస్స్ ఎమ్మెలేలు కలిసిన విషయంపైనా ఆసక్తిగా స్పందించారు.

అవును... సినిమా ఫంక్షన్ అయినా, పొలిటికల్ సభ అయినా, పబ్లిక్ తో చిట్ చాట్ అయినా... బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలకు, ప్రసంగాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారనే చెప్పాలి. ప్రధానంగా ఒక సినిమా ఫంక్షన్ లో పవన్ పై కురిపించిన ప్రశంసలు.. ఒక టీవీ ఇంటర్వ్యూలో చేసిన సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ ఛాలెంజ్ లు.. ఏపీలో బాబు అరెస్ట్ అనంతరం హైదరాబాద్ లో చేసిన వ్యాఖ్యలు.. వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు బండ్ల గణేష్. ఇందులో భాగంగా... గత కొన్ని రోజులుగా కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే తనకు భయమనిపిస్తుందని మొదలుపెట్టారు గణేష్. రెండేళ్లలో ప్రభుత్వాన్ని పడగొడతాం.. త్వరలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అని అంటున్నారని.. అయితే ఆ ప్రయత్నం పక్క రాష్ట్రాల్లో చేసుకోవాలని అన్నారు.

ఇందులో భాగంగా... త్వరలో ఏపీలో, మహారాష్ట్రలో, కేరళలో ఎన్నికలు జరగనున్నాయి... అంతెందుకు బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కు ఏ రాష్ట్రం నుంచినా పోటీ చేసే అర్హత ఉందని.. ఇదే సమయంలో బీఆరెస్స్ భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో నలుగురు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ని కలిస్తే... కొంపలు మునిగిపోయినట్లు ఆగమాగం అవుతున్నారని బండ్ల స్పందించారు.

అలా రేవంత్ ను కలిసిన ఎమ్మెల్యేలను మానసికంగా హించించి, స్క్రిప్ట్ రాసిచ్చి, ప్రెస్ మీట్ లు పెట్టి చదవమని చెప్పారని అన్నారు బండ్ల. నియోజకవర్గంలో రెండు లక్షల ఓటర్లకు ప్రతినిధిగా ఉన్నప్పుడు వారి కష్టాల గురించి ముఖ్యమంత్రికి చెప్పుకొద్దా.. ముఖ్యమంత్రిని కలవద్దా.. ఇది ప్రజాస్వామ్యం కాదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రజలంతా మీ చెప్పుచేతల్లో ఉండాలనే ఇంకా ఆలొచిస్తారా అని బండ్ల నిలదీశారు!

ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పరిపాలిస్తుందని.. ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే... కేటీఆర్ డైలీ ప్రెస్ మీట్ లు పెడుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే... "గూగుల్ పే చేయడం.. ప్రెస్ మీట్ లు పెట్టడం" అని బండ్ల కామెంట్ చేశారు. ఇదే సమయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆరెస్స్ లో చేర్చుకున్న విషయాన్ని బండ్ల ప్రస్తావించారు.

ఈ విషయంలోనే... బీఅరెస్స్ చేస్తే సంసారం, కాంగ్రెస్ చేస్తే తప్పా అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో ప్రస్తుతానికి సీఎం పోస్ట్ ఖాళీగా లేదని.. ఐదేళ్ల వరకూ ఎన్నికలూ లేవని.. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని గణేష్ నొక్కి చెప్పారు! అలా కాకుండా ఇప్పుడే సీఎం అవ్వాలని భావిస్తే... వేరే రాష్ట్రాలకు వెళ్లాలని బండ్ల సూచించారు. దీంతో... ఈ వీడియో వైరల్ అవుతుంది!!

ఈ సందర్భంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా... "మీరు ఆగం కావొద్దని కోరుకుంటూ... మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... మీ బండ్ల గణేష్" అని కన్ క్లూజన్ ఇవ్వడం గమనార్హం!