Begin typing your search above and press return to search.

అధ్యక్షుడిగా దిగిపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా వెంటాడుతున్న అసమ్మతి నేతలు!

2018లో ఎంపీగా గెలిచిన దగ్గర నుండి బండి వైఖరిలో బాగా మార్పొచ్చేసిందట. అంతకుముందు అందరితోను బాగానే ఉన్న బండి ఎంపీగా గెలవటంతోనే ఒంటెత్తు పోకడలు మొదలయ్యాయట.

By:  Tupaki Desk   |   21 Dec 2023 10:30 AM GMT
అధ్యక్షుడిగా దిగిపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా వెంటాడుతున్న అసమ్మతి నేతలు!
X

తెలంగాణా బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అసమ్మతి వదిలిపెడుతున్నట్లు లేదు. అధ్యక్షుడిగా దిగిపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా కూడా బండిని అసమ్మతి నేతలు వెంటాడుతునే ఉన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బండికి కరీంనగర్ ఎంపీగా ఎట్టి పరిస్ధితుల్లోను టికెట్ ఇచ్చేందుకు లేదని అసమ్మతి నేతలు గట్టిగా చెబుతున్నారు. బండిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతలంతా రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఎంపీ టికెట్ బండికి కాకుండా ఇంకెవరికి ఇచ్చినా పర్వాలేదని అసమ్మతి నేతలు తీర్మానించారని పార్టీలో చర్చ జరుగుతోంది.

2018లో ఎంపీగా గెలిచిన దగ్గర నుండి బండి వైఖరిలో బాగా మార్పొచ్చేసిందట. అంతకుముందు అందరితోను బాగానే ఉన్న బండి ఎంపీగా గెలవటంతోనే ఒంటెత్తు పోకడలు మొదలయ్యాయట. సీనియర్లకు మర్యాద ఇవ్వటం మానేశారట. ఏ విషయం కూడా సీనియర్లతో చర్చించటం మానేసినట్లు పార్టీలో టాక్. బండి ఒంటెత్తుపోకడలను తట్టుకోలేకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్లంతా ఏకమయ్యారు. జిల్లాలో బండికి వ్యతిరేకంగా చాలా సమావేశాలు నిర్వహించారు.

పార్టీలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బండి వ్యతిరేకులతో కరీంనగర్ జిల్లాలోని బండి వ్యతిరేకులు చేతులు కలిపారు. దాంతో అలెర్టయిన బండి అగ్రనేతలతో మాట్లాడి తన వ్యతిరేకులకు నోటీసులిప్పించారు. అంతేకాకుండా అసమ్మతి కార్యక్రమాలకు దిగితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే బండి ఎంత హెచ్చరించినా అసమ్మతి నేతలు ఏమాత్రం వెనక్కుతగ్గలేదు. పైగా బండికి వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్ళి అగ్రనేతలతో భేటీలు కూడా అయ్యారు.-

దాంతో అనేక విషయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం బండిని అధ్యక్షుడిగా తప్పించింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండికి కరీంనగర్ టికెట్ ఇచ్చింది. అప్పటికే బండిమీద మండిపోతున్న వ్యతిరేకత వర్గమంతా బండి గెలుపుకు ఏమాత్రం పనిచేయలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. దాంతో చివరకు బండి ఓడిపోయారు. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బండికి ఎట్టి పరిస్ధితుల్లోను టికెట్ ఇవ్వద్దని అగ్రనేతలకు బండి వ్యతిరేకులు చెబుతున్నారు. ఇదే విషయమై అగ్రనేతలతో మాట్లాడేందుకు తొందరలోనే ఢిల్లీకి వెళ్ళాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇంతమందిని ప్రత్యర్ధులుగా మార్చుకుని బండి ఏమి సాధించాలని అనుకుంటున్నారో చూడాలి.