Begin typing your search above and press return to search.

పొడుపుకథ : బండి సంజయ్ మాస్ ర్యాగింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విసిరిన పొడుపుకథ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   1 May 2024 4:17 AM GMT
పొడుపుకథ : బండి సంజయ్ మాస్ ర్యాగింగ్
X

ఉత్తి మాటల కాయ ఉత్తుత్తి కాయ..

ఒక్క చెట్టున ఉండదు ఒగలాడి కాయ..

తుట్టి నింపుకుని తుర్రుమనెడి కాయ..

చెప్పు మాటలే గాని చేయలేని కాయ..

సైజు సిన్నదే గానీ గాయి చేసేడి కాయ..

రేతోని మొదలు గాని కాదు రేగ్గాయ..

ఆ కాయ పేరు చెప్పగలరా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విసిరిన పొడుపుకథ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దాదాపు నెటిజన్లు అందరూ ఈ పొడుపు కథకు రేవంత్ రెడ్డి అని సమాధానం ఇస్తుండడం విశేషం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు లక్ష్యంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో బండి సంజయ్ స్పందిస్తున్నాడు.

‘‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఏమయిందని అడిగితే రేవంత్ రెడ్డి గుండు, అరగుండు అని హేళన చేస్తున్నాడని, రేవంత్ ఎన్ని డ్రామాలు ఆడినా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు గుండు సున్నా’’ అని బండి సంజయ్ ఎద్దేవా చేశాడు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ మాట్లాడే భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించాడు.

జమ్మికుంటలో రేవంత్ నిర్వహించిన జనజాతర బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు అనడానికి ఈ సభ విఫలమే నిదర్శనం అని బండి సంజయ్ అన్నాడు. ఎన్నికలలో ఓటమి ఖాయం అన్న భయంతో రేవంత్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలంతా అసభ్యపదజాలంతో తిడుతూ ప్రజలలో మరింత చులకన అవుతున్నారని తెలిపాడు.