Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ సర్కార్ ని కూలే కుట్ర...!?

అలా భారీ మెజారిటీని చేసుకుని తమకు అసెంబ్లీ ఫ్లోర్ మీద ఎదురులేదనిపించుకుంది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 4:33 AM GMT
టీ కాంగ్రెస్ సర్కార్ ని కూలే కుట్ర...!?
X

తెలంగాణాలో ఏమి జరగబోతోంది అన్నది ఒక చర్చగా ఉంది. ఎందుకంటే డిసెంబర్ లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ సింపుల్ మెజారిటీయే దక్కింది. ఇది 2014ని గుర్తుకు తెస్తోంది. అప్పట్లో టీఆర్ఎస్ కి 61 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ పార్టీ మద్దతుదారుగా ఉన్నా మజ్లీస్ కి ఏడు సీట్లు ఉన్నా నాడు టీఆర్ఎస్ కి ధైర్యం చాలలేదు. అందుకే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ ల నుంచి ఎమ్మెల్యేలను ప్రోత్సహించి తమ వైపు కలిపేసుకుంది.

అలా భారీ మెజారిటీని చేసుకుని తమకు అసెంబ్లీ ఫ్లోర్ మీద ఎదురులేదనిపించుకుంది. ఇక 2018లో టీఆర్ఎస్ కి ఎనభై ఎనిమిది దాకా సీట్లు వచ్చినా కూడా మళ్లీ ప్రతిపక్షాలను చేర్చుకుంది. దాంతో వందకు పైగా ఎమ్మెల్యేల బలాన్ని పెంచుకుంది. అయితే మొదటిసారికి జనాలు ఓకే అన్నారు. కానీ రెండవసారి పూర్తి బలం ఇచ్చినా కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని సహించలేకపోయారు అన్నదే 2023 ఎన్నికల రిజల్ట్ గా చెప్పుకుంటారు.

ఇక ఇపుడు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ కి సింపుల్ మెజారిటీ వచ్చింది. పైగా కాంగ్రెస్ లో వర్గ పోరు అలాగే ఉంది. రేవంత్ రెడ్డిని సీఎం గా చేయడం సీనియర్లకు పెద్దగా ఇష్టంలేదు. కానీ హై కమాండ్ నచ్చచెప్పిన మీదట వారు ఆగారు. అయితే ఈ సంబరం అంతా పార్లమెంట్ ఎన్నికల వరకే అని అంటున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి మెజారిటీ దక్కి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఓకే. లేకపోతే కాంగ్రెస్ లో వర్గ పోరు తెర పైకి వస్తుంది అన్న మాట ఉంది.

ఇక విపక్షాల వైపు నుంచి చూస్తే బీఆర్ఎస్ కి కూడా కాంగ్రెస్ లో వర్గ పోరు మీదనే ఆశలు ఉన్నాయని అంటున్నారు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుని డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటే కనుక తమకే ప్రజల మద్దతు ఉందని చెప్పి ఆ మీదట ఆపరేషన్ కాంగ్రెస్ ని స్టార్ట్ చేయవచ్చు అని ప్రచారం లో ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని ఆయన పెద్ద బాంబే పేల్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలే చేశారు.

అంతే కాదు ఆయన కూడా ఒక డెడ్ లైన్ పెట్టేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైనా జరగొచ్చు అని హింట్ కూడా ఇచ్చారు. పనిలో పనిగా కేసీఆర్‌ మీద హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని నిందించారు. కుట్రలకు కేరాఫ్‌ కేసీఆర్ అని బండి పవర్ ఫుల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందువల్ల కేసీఆర్‌ కదలికలపై కాంగ్రెస్ నిఘా పెట్టాలని కూడా సూచించారు.

ఇదే సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు ఎక్కువ సంఖ్యలో గెలవాలని బండి ప్రజలకు పిలుపు ఇచ్చారు. తెలంగాణాలో బీజేపీ ఎంపీలు గెలిస్తే నిధులు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. అదే సమయంలో ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అభ్యర్థులు లేరని చావు కబురు చల్లగా చెప్పేశారు

ఇలా బండి సంజయ్ పండుగ వేళ చాలా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వాటిలో చూస్తే బీఆర్ ఎస్ మీద నిప్పులు చెరుగుతూనే కాంగ్రెస్ ని అలెర్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కి తెలంగాణాలో నో ప్లేస్ అని చెప్పాలని ఆరాటం కనిపిస్తోంది.

దీని మీద కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వచ్చాయి.వచ్చే ఎన్నికల్లో 13 నుంచి 14 లోక్‌సభ స్థానాలు గెలుస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అదే టైం లో పొన్నం ప్రభాకర్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముట్టుకునే దమ్ము బీజేపీ, బీఆర్ఎస్ కు అసలు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంత బలహీనంగా లేదని ఆయన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే సాహసం ఎవరూ చేయలేరన్న ధీమా వ్యక్తం చేశారు.

అంతే కాదు ఆయన కూడా బీఆర్ఎస్ నే టార్గెట్ చేశారు. ఆ పార్టీ త్వరలోనే రెండుగా చీలిపోతుందన్నారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్‌ ఒక్కటేనని బండి సంజయ్ వ్యాఖ్యలతో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక పార్టీకి సంబంధించిన సమాచారం మరో పార్టీకి ఎలా తెలుస్తుందని పొన్నంప్రశ్నించారు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు కాంగ్రెస్ సర్కార్ ని కూల్చే కుట్ర నిజంగా జరుగుతోందా బండి కామెంట్స్ వెనకాల అర్ధం ఏంటి అన్నది మాత్రం పండుగ వేళ ఎవరినీ నిద్ర పట్ట నీయకుండా బుర్రలు హీటెక్కించేస్తోంది.