Begin typing your search above and press return to search.

ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు: బండి సంచల‌న వ్యాఖ్య‌లు

నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని బండి సంజ‌య్ విమ‌ర్శించారు.

By:  Tupaki Desk   |   11 July 2024 7:03 AM GMT
ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు:  బండి సంచల‌న వ్యాఖ్య‌లు
X

కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి, బీజేపీ తెలంగాణ నాయ‌కుడు బండి సంజ‌య్‌.. ఏపీలోని గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని పాలించిన గ‌త పాల‌కులు(జ‌గ‌న్‌) వీర‌ప్ప‌న్ వార‌సులు అంటూ.. సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు. తాజాగా గురువారం ఆయ‌న తిరుమలలో ప‌ర్య‌టించారు. ఆయ‌న పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. గ‌త ఏపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు కుమ్మ‌రించారు. వైసీపీ మంత్రులు, నాయ‌కులు నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు పెట్టారని బండి వ్యాఖ్యానిం చారు.

ఎర్రచందనం దోపిడీ చేసిన వైసీపీ ముఠా.. ఏపీకి అప్పులిచ్చే స్థాయికి ఎదిగింద‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశంలోఎక్క‌డా ల‌భ్యం కాని ఎర్ర‌చంద‌నం.. తిరుమ‌ల శేషాచ‌లం కొండ‌ల్లోనే విరివిగా వ‌స్తోంద‌ని.. దీనిపైనే గ‌త వైసీపీ నాయ‌కులు, పాల‌కులు కూడా క‌న్నేశార‌ని.. అడ్డంగా దోచేశార‌ని వ్యాఖ్యానించారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామ‌ని బండి తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని బండి సంజ‌య్ విమ‌ర్శించారు. ఎక్క‌డిక‌క్క‌డ అన్య‌మ‌తాన్ని ప్రోత్స‌హించార‌ని.. ఒక కీల‌క ప‌ద‌విలో(జ‌గ‌న్‌) ఉన్న వ్య‌క్తి ఆచ‌రించిన మ‌తాన్నే అంద‌రూ ఆచ‌రించేలా ఒత్తిడి తెచ్చామ‌న్నారు. ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయిందని జ‌గ‌న్ పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో `గోవిందుడి` పాలన వచ్చిందని అన్నారు.