Begin typing your search above and press return to search.

బండి లేకుండానే బీజేపీ ఆందోళనలు.. హాట్ టాపిక్కే..

నెల రోజుల్లోనే పరిస్థితులు ఎంతలా మారిపోయాయి

By:  Tupaki Desk   |   20 July 2023 11:34 AM GMT
బండి లేకుండానే బీజేపీ ఆందోళనలు.. హాట్ టాపిక్కే..
X

నెల రోజుల్లోనే పరిస్థితులు ఎంతలా మారిపోయాయి..? రెండు నెలల కిందట ఎలా ఉండేది ఇప్పుడెలా అయింది..? ఆరు నెలల కిందటైతే అధికారమే తరువాయి అన్నట్లు హడావుడి చేసింది. మరిప్పుడు.. సారథి మారిపోయారు.. కొత్త (పాత) సారథి వచ్చారు.. ఆ ఊపు లేదు.. ఆ దూకుడు లేదు.. అసలు పాత సారథిని ఎందుకు తొలగించారో తెలియడం లేదంటే.. ఆయన లేకుండానే కార్యక్రములు చేస్తున్న వైనం కనిపిస్తోంది.

అంతా మార్పు

ఇదంతా రాష్ట్ర బీజేపీ గురించి. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కు మూడేళ్ల కిందట రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించిన అధిష్ఠానం.. ఎన్నికలకు నాలుగు నెలల వ్యవధి ఉందనగా ఆయనను తప్పించింది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తిరిగి రాష్ట్ర సారథి బాధ్యతలు ఇచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని చెబుతున్న ఓ పార్టీ ఇంతటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు.

బండి ఏమయ్యారు..?

బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒంటికాలు మీద లేస్తూ, పాదయాత్రలు చేస్తూ, ఆందోళనలు చేపడుతూ తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకొచ్చారు బండి సంజయ్. కానీ, ఆయనను తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరే.. పార్టీ నిర్ణయం శిరోధార్యం అంటూ సంజయ్ తనకుతాను సర్దిచెప్పుకొన్నారు. కానీ, ఇదే సమయంలో కర్ణాటకలో ఘన విజయంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ ఊపులోకి వచ్చింది. అయితే, బీజేపీ అనూహ్యంగా వెనుకబడిపోయిందన్న భావన ప్రజల్లో ఏర్పడింది.

ఆందోళనలో ఆయన ఎక్కడ?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం డబుల్ బెడ్ రూం ఇళ్లు. కానీ, పథకం తుస్సుమంది. దీనిపై లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ బీజేపీ ఆందోళనలకు సిద్ధమైంది. కొత్త నాయకుడు కిషన్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ శివారు బాటసింగారంలో రెండు పడకగదుల ఇళ్ల పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించింది. శంషాబాద్‌ నుంచి కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తదితరులు బాటసింగారం బయల్దేరారు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ కిషన్‌ రెడ్డి, రఘునందన్‌ వర్షంలోనే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం వారితో పాటు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇదే తరహాలో ఆందోళనలకు సిద్ధమవుతున్న బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణలనూ పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు.

బండి ఢిల్లీ వెళ్లారా...?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. బండి సంజయ్ దీనికోసం ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అందుకే రాష్ట్ర బీజేపీ తలపెట్టిన ఆందోళనల్లో పాల్గొనలేదని సమాచారం. అయితే, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక తొలిసారి నిర్వహిస్తున్న ఆందోళనల్లో బండి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా హైదరాబాద్ లో ఆందోళనకు సిద్ధమైతే.. ఎంపీ హోదాలోని బండి మాత్రం ఢిల్లీ వెళ్లడం గమనార్హం.