Begin typing your search above and press return to search.

రేవంత్ కు.. కేసీఆర్ కు తేడా ఏముంది? తేల్చేసిన బండి

గడిచిన కొంతకాలం గమ్మున ఉన్న ఆయన ఇప్పుడు తరచూ చెలరేగిపోతున్నారు. సీఎం రేవంత్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ నిత్యం వార్తల్లో దర్శనమిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:31 AM GMT
రేవంత్ కు.. కేసీఆర్ కు తేడా ఏముంది? తేల్చేసిన బండి
X

బీజేపీ నేత బండి సంజయ్ మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన కొంతకాలం గమ్మున ఉన్న ఆయన ఇప్పుడు తరచూ చెలరేగిపోతున్నారు. సీఎం రేవంత్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ నిత్యం వార్తల్లో దర్శనమిస్తున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ ను.. ఆయన ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. సీఎంగారు.. మీకు, కేసీఆర్ కు తేడా ఏముంది? అంటూ సూటిగా అడిగేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండునెలల్లో రూ.10వేల కోట్లు అప్పు చేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. ఇచ్చిన మాట కట్టుబడి వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసే దమ్ముందా? అంటూ సవాలు విసిరారు.

అంతేకాదు.. అప్పట్లో కేసీఆర్ సర్కారు తనను రాచి రంపాన పెట్టిందని.. అయినా ఎదిరించి జనం కోసం కోట్లాడిన విషయాన్ని గుర్తు చేసిన బండి.. "కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలెన్నడైనా ప్రజల కోసం కొట్లాడారా? పొరపాటున కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఎరువుల సబ్సిడీ ఆపేస్తారు? గ్రామాలకిచ్చే నిధులన్నీ ఆగిపోతాయి. ప్రజలంతా బిచ్చగాళ్లుగా మారే ప్రమాదముంది" అంటూ నిప్పులు చెరిగారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి మండలాల్లో కొనసాగిన మలిదశ ప్రజాహిత యాత్రలో భాగంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

బండి చేసిన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చూస్తే.. 'సీఎం గారు… మీకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది? 10 ఏళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు తెస్తే… మీరు 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తే…. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని మీరు మోసం చేయబోతున్నారు? అరకొర హామీల అమలుతో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవాలనుకుంటున్నరు. తెలంగాణకు కేంద్రం నయా పైసా సాయం చేయలేదని సీఎం అంటున్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని బుకాయిస్తున్నారు. మోదీ పాలనలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చింది. అసలు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోందంటే మోదీ గారు ఇస్తున్న నిధుల పుణ్యమే. దమ్ముంటే ఆ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?' అంటూ సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు.

"వంద రోజుల్లోనే మీరు 6 గ్యారంటీలన్నీ అమలు చేస్తానన్నారు. 75 రోజులు దాటిపోయాయి. ఎన్నికల కోడ్ రాబోతోంది? మరి రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతు బంధు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్నారు కదా ఏవి? మహిళలకు నెలనెలా రూ.2,500లు ఇస్తానన్నారు ఎందుకివ్వడం లేదు? ఆసరా పెన్షన్ రూ.4 వేలు ఇస్తానన్న హమీ ఎందుకు అమలు చేయడం లేదు? రూ.5 వందలకే గ్యాస్ సిలిండర్, 200 వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చి చేతులు దులుపేసుకోబోతున్నరు. మిగిలిన గ్యారంటీలన్నీ గాలికొదిలేసి ప్రజలను మోసం చేయబోతున్నరు" అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అరకొర హామీలను రేషన్ కార్డులు ఉన్నోళ్లకే ఇస్తారట అంటూ ఎద్దేవా చేసిన బండి… "గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి వాళ్ల సంగతేమిటి. ఎవరు ప్రజలను మోసం చేస్తున్నారో, ఎవరు పేదలను ఆదుకుంటున్నారో ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోంది కేంద్రంవల్లే. గ్రామాలకు నిధులిస్తోందే మోదీ ప్రభుత్వం. అయినా ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నయ్. 5 వందల ఏళ్ల కల రామ మందిర నిర్మాణం. ఆ కలను సాకారం చేసిన మహానేత నరేంద్రమోదీ. రైతులకు ఎరువుల, కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఎకరాకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే. నేను సవాల్ చేస్తున్నా… తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్దం. డేట్, టైం, వేదిక ఫిక్స్ చేయండి. మీరు చేసినా… లేదంటే మేమైనా చేస్తాం… మా తరపున కిషన్ రెడ్డి గారిని ఒప్పించి పంపిస్తాం… దమ్ముంటే మీరు రండి… తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో… కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏమిచ్చాయో ప్రజల సమక్షంలో తేలుద్దాం.. ఇకనైనా అబద్దాలు, డ్రామాలాడటం మాని వాస్తవాలను ప్రజల ముంచుందాం రండి" అంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. మరి.. దీనిపై సీఎం రేవంత్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.