మొత్తానికి బండి సంజయ్ ఒక ఇంటి వాడయ్యారు
బండి సంజయ్ ఈ పేరు తెలుగు నాట అందరికీ పరిచయమే. ముఖ్యంగా తెలంగాణా వారికి ఇంకా బాగా తెలుసు.
By: Tupaki Desk | 25 Jun 2025 9:25 AM ISTబండి సంజయ్ ఈ పేరు తెలుగు నాట అందరికీ పరిచయమే. ముఖ్యంగా తెలంగాణా వారికి ఇంకా బాగా తెలుసు. చాలా ఏళ్ళ పాటు ఆయన బీజేపీ ప్రెసిడెంట్ గా తెలంగాణా రాజకీయాలలో దూకుడు చేశారు. ఆనాటి కేసీఅర్ ప్రభుత్వం మీద ఒంటి కాలి మీద విరుచుకుపడ్డారు దాంతో బీజేపీకి ఎక్కడ లేని ఊపు వచ్చింది.
పార్టీ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. ఉప ఎన్నికలు జరిగితే ఎక్కువ బీజేపీ గెలుచుకుంది. నాడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో సైతం అత్యధిక సీట్లు తెచ్చుకుని ప్రత్యర్ధులకు షాక్ ఇచ్చింది. ఆ తరువాత బండి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కేంద్రంలో మంత్రి అయ్యారు.
ఇలా ఒక సాధారణ కార్పోరేటర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఈ రోజున కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు. పైగా హోం మంత్రిత్వ శాఖలో కేంద్ర సహాయ మంత్రి అంటే పవర్ ఫుల్ పోస్టు కిందకే లెక్క. మరి బండి ఇంతటి హోదాలో ఉన్నా ఆయనకంటూ సొంత ఇల్లు లేకపోవడం చిత్రాతిచిత్రం అని అంటున్నారు.
బండికి ఇప్పటిదాకా ఒక ఇల్లు లేదు అంటే రాజకీయంగా అంతా షాక్ తినాల్సిందే. సాధారణ ప్రజలు సైతం నోరు వెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ రోజులలో చిన్న పాటి నాయకులకు కూడా ఒకటి రెండు మంచి ఇళ్ళు ఉంటున్నాయి. అలాంటిది బండికి మాత్రం ఇల్లు అంటూ లేదు అన్నది తాజాగా తెలిసింది.
ఆయన తాజాగా హైదరాబాద్ లోని చైతన్యపురిలో ఒక ఇంటిని 98 లక్షలతో కొనుగోలు చేశారు. లేటెస్ట్ గా దానిని సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అని అంటున్నారు. ఇక ఆ ఇల్లు కొనడానికి కూడా ఆయన తన సతీమణి పేరుతో 85 లక్షల రూపాయల బ్యాంక్ రుణాన్ని తీసుకున్నారు. ఆయన భార్య బ్యాంకు అధికారిగా ఉండడం వల్లనే ఈ రుణం తీసుకున్నారు అని అంటున్నారు.
మరి ఇంతకాలం బండి ఎక్కడ ఉంటున్నారు అంటే తన అత్తగారి ఇంట్లోనే అని అంటున్నారు. రెండు సార్లు ఎంపీ కేంద్ర మంత్రి దశాబ్దాల పాటు రాజకీయ జీవితం. అయినా సొంత ఇల్లు లేకపోవడం అంటే బండి సంజయ్ రాజకీయ నిజాయతీ తెలుస్తుంది అని అంటున్నారు. ఒక చిన్న కార్పోరేటర్ అయితే చాలు కబ్జాలు చేస్తూ కోట్లు కొట్టేస్తూ దర్జా చేసే పెద్ద రాజకీయ కామందులు ఉన్న ఈ రాజకీయ రోజులల్లో బండి సంజయ్ లాంటి వారు ఉండడం అరుదు అని అంటున్నారు.
నిజంగా ఆయన చాలా మందికి ఆదర్శం స్పూర్తి అని అంటున్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలను నోటితో వల్లె వేయడం కాదు తుచ తప్పకుండా ఆచరణలో అమలు చేసిన వారే నిజమైన నాయకుడు అవుతారు అని అంటారు. అలా బండి సంజయ్ బీజేపీలో మొదటి నుంచి ఉంటూ తన స్వార్థం చూసుకోకుండా ఇంతటి స్థాయికి వచ్చారు అని చెప్పడానికి ఇది అచ్చమైన ఉదాహరణ అని అంటున్నారు.
