Begin typing your search above and press return to search.

అవినీతి కేసుల్లో టీ మంత్రులు అరెస్టు.. బండి చెప్పిన ఆ ఇద్దరు ఎవరు?

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   26 Dec 2025 11:07 AM IST
అవినీతి కేసుల్లో టీ మంత్రులు అరెస్టు.. బండి చెప్పిన ఆ ఇద్దరు ఎవరు?
X

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా జైలు మాట చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో బండి ప్రస్తావించిన ఆ ఇద్దరు అవినీతి మంత్రులు ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నట్లుగా చెప్పిన బండి సంజయ్.. ‘‘అవినీతి కేసుల్లో ఆ ఇద్దరు మంత్రులు జైలుకే. వారిద్దరూ వేల కోట్ల రూపాయిల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. నిఘా రిపోర్టులు తెప్పించుకుంటున్నాం. త్వరలోనే అవినీతి భాగోతం బయటకు వస్తుంది’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే పెద్ద శనిగా అభివర్ణించటం గమనార్హం. హైదరాబాద్ లోని ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన బండి సంజయ్.. రాష్ట్ర మంత్రుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ నోటి నుంచి తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రుల అవినీతి భాగోతం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలాన్ని రేపుతున్నాయి. చట్టంలోని లొసుగులను అసరా చేసుకొని ఇద్దరు మంత్రులు వేలాది కోట్ల రూపాయిల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఇద్దరు మంత్రులు చేస్తున్న అవినీతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం గుర్రుగా ఉన్నారని.. ఏదోరోజు వారిపై తిరగబడే రోజు వస్తుందన్న జోస్యాన్ని చెప్పారు బండి సంజయ్.

తెలంగాణకు చెందిన మంత్రుల అవినీతిపై తాము కూడా నిఘా వర్గాల రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లుగా పేర్కొన్న బండి సంజయ్.. ‘వారి అవినీతి భాగోతం త్వరలోనే బయటపెడతాం. మాకున్న సమాచారం ప్రకారం చాలామంది ఎమ్మెల్యేలు నిరాశ.. నిస్ప్రహల్లో ఉన్నారు. వాళ్ల ఆవేదన మాతో పంచుకుంటున్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసంత్రప్తిని వ్యక్తం చేస్తున్నారు’’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. బండి వ్యాఖ్యల నేపథ్యంలో అంత భారీగా అవినీతికి పాల్పడుతున్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.