బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ
ఇక కోర్టు కూడా విచారణకు సంబంధించి కొన్ని కీలక నిబంధనలు విధించింది. నిందితుడిపై ఎటువంటి థర్డ్ డిగ్రీ పద్ధతులు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
By: A.N.Kumar | 26 May 2026 11:42 PM ISTతెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన బండి భగీరథ్‌పై నమోదైన పొక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు కోసం మరింత సమయం అవసరమని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం కస్టడీకి అనుమతి ఇచ్చింది.
మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసులో బండి భగీరథ్‌ను ఈ నెల 16న నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. తాజాగా విచారణలో భాగంగా మరిన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు.
కస్టడీ సమయంలో భగీరథ్‌ను ఘటనకు సంబంధించిన వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ డేటా, కాల్ రికార్డులు, సోషల్ మీడియా కార్యకలాపాలు, ఇతరులతో సంబంధాలు వంటి అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక కోర్టు కూడా విచారణకు సంబంధించి కొన్ని కీలక నిబంధనలు విధించింది. నిందితుడిపై ఎటువంటి థర్డ్ డిగ్రీ పద్ధతులు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అలాగే ప్రతిరోజూ విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
ఈ కేసు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకోవడంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కస్టడీ విచారణలో బయటపడే వివరాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. మూడు రోజుల కస్టడీ గడువు పూర్తయ్యాక భగీరథ్‌ను తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
