Begin typing your search above and press return to search.

పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

తీవ్ర ఉత్కంఠ నడుమ శనివారం రాత్రి 8 గంటల సమయంలో బగీరథ్ సరెండర్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదలైంది. చట్టంపై ఉన్న గౌరవంతో పోలీసులకు లొంగిపోయినట్టుగా పేర్కొన్నారు.

By:  A.N.Kumar   |   16 May 2026 10:00 PM IST
పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
X

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి.. అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో శనివారం రోజంతా తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

లుకౌట్ నోటీసులు.. 5 ప్రత్యేక బృందాలతో గాలింపు

మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణలతో ఈ నెల 8న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై కేసు నమోదైంది. అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశముందని భావించిన పోలీసులు శనివారం ఉదయం లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. భగీరథ్‌ను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు.. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్ జిల్లాలోనూ విస్తృతంగా గాలింపు చేపట్టారు.

భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచాఫ్ కావడంతో పోలీసులు కాల్ డేటా రికార్డులను విశ్లేషించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నివాసంతో పాటు జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని భగీరథ్ స్నేహితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌లోని అతని సొంత నివాసం, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

తీవ్ర ఉత్కంఠ నడుమ శనివారం రాత్రి 8 గంటల సమయంలో బగీరథ్ సరెండర్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదలైంది. చట్టంపై ఉన్న గౌరవంతో పోలీసులకు లొంగిపోయినట్టుగా పేర్కొన్నారు.

అనంతరం కొద్దిసేపటికే అప్పా జంక్షన్ సమీపంలో భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. అయితే భగీరథ్ ఇద్దరు న్యాయవాదులతో కలిసి నాలుగు కార్ల కాన్వాయ్‌లో నేరుగా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.

అర్ధరాత్రి మేజిస్ట్రేట్ నివాసంలో హాజరు

భగీరథ్ రాకతో పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు పర్యవేక్షణాధికారిణి.. డీసీపీ రితిరాజ్ స్వయంగా విచారణను పర్యవేక్షించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ విజయ్‌వర్ధన్ పంచనామా ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం భగీరథ్‌కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మేడ్చల్ మేజిస్ట్రేట్ నివాసంలో భగీరథ్‌ను హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం

ఈ కేసు దర్యాప్తులో శనివారం ఉదయం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలైన మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 183 ప్రకారం ఈ స్టేట్‌మెంట్‌ను పూర్తి వీడియో రికార్డింగ్‌తో భద్రపరిచారు. పోక్సో కేసుల్లో మేజిస్ట్రేట్ ముందు ఇచ్చే ఇటువంటి వాంగ్మూలాలు కోర్టు విచారణలో అత్యంత కీలక ఆధారాలుగా మారనున్నాయి.

ప్రస్తుతం ఈ ఉదంతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విపక్షాలు, అధికార పక్షాల మధ్య ఈ కేసు చుట్టూ రాజకీయ విమర్శలు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.