Begin typing your search above and press return to search.

బండి భగీరథ్‌కు బెయిల్.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

భగీరథ్ ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడని ఇప్పటికే 45 రోజులకు పైగా జైలులో ఉండటం వల్ల ఆయన విద్యా సంవత్సరం నష్టపోవడంతో పాటు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడిందని కోర్టుకు వివరించారు.

By:  A.N.Kumar   |   9 July 2026 6:38 PM IST
బండి భగీరథ్‌కు  బెయిల్.. కానీ ట్విస్ట్ ఏంటంటే?
X

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసులో ఎట్టకేలకు భగీరథ్‌కు న్యాయస్థానం నుండి ఉపశమనం లభించింది. అయితే బయటకు వచ్చినప్పటికీ ఆయన కోర్టు విధించిన కఠిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

లక్ష రూపాయల పూచీకత్తు.. కఠిన నిబంధనలు

తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్‌కు బెయిల్ ఇస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. 1,00,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు సమాన మొత్తంలో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని స్పష్టం చేసింది. వీటితో పాటు న్యాయస్థానం కఠిన నిబంధనలు విధించింది. కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించడం లేదా ప్రభావితం చేయడం చేయకూడదు. పోలీస్ విచారణ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలి. ఒకవేళ న్యాయస్థానం విధించిన బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లయితే బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది.

కేసు నేపథ్యం.. 45 రోజులకు పైగా జైల్లో..

హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను గత మే 18న పోలీసులు అరెస్ట్ చేయగా అప్పటి నుంచి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు జూలై 6న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈరోజు తుది తీర్పును వెలువరిస్తూ నిబంధనలతో కూడిన బెయిల్‌ను ఖరారు చేసింది.

కోర్టులో హోరాహోరీ వాదనలు

విచారణ సందర్భంగా బాధితురాలి తరఫు న్యాయవాది భగీరథ్‌కు బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో ఆయనకు ఉన్న రాజకీయ రికార్డు, పలుకుబడి వల్ల బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలి భద్రతను రక్షించేందుకు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు.

మరోవైపు బండి భగీరథ్ తరఫు న్యాయవాది గట్టిగా కౌంటర్ ఇచ్చారు. భగీరథ్ ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడని ఇప్పటికే 45 రోజులకు పైగా జైలులో ఉండటం వల్ల ఆయన విద్యా సంవత్సరం నష్టపోవడంతో పాటు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడిందని కోర్టుకు వివరించారు. ఆయన ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని కోర్టు విధించే ప్రతి షరతును కచ్చితంగా పాటిస్తూ దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇరు పక్షాల వాదనలు, నిందితుడి భవిష్యత్తును, కేసులోని సున్నితమైన పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన హైకోర్టు.. దర్యాప్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా కఠిన నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇకపై ఈ కేసు విచారణ కొనసాగనున్న నేపథ్యంలో భగీరథ్ కోర్టు నియమాలను పాటిస్తూ విచారణకు హాజరవ్వాలి.