Begin typing your search above and press return to search.

టీడీపీ నేత బండారుపై స్టార్‌ హీరోయిన్‌ ఆగ్రహం!

ఏపీ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   6 Oct 2023 10:29 AM GMT
టీడీపీ నేత బండారుపై స్టార్‌ హీరోయిన్‌ ఆగ్రహం!
X

ఏపీ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండారును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా మండిపడ్డారు. తనపై మొదటి నుంచి టీడీపీ నేతలు ఇలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని టీడీపీ నేతలు రోజాకు కౌంటర్‌ ఇస్తున్నారు. వైసీపీలో ఎంతోమంది మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని.. వారినెవరినీ అననివారు రోజాని మాత్రమే ఎందుకంటున్నారనేది ఆమె తెలుసుకోవాలని కోరుతున్నారు. రోజా మాత్రం ఎవరినైనా ఏమైనా అనొచ్చు కానీ ఇతరులెవరూ ఆమెను అనకూడదా అని నిలదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కుష్భూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజాపై వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తిపై కుష్భూ మండిపడ్డారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని తెలిపారు. తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

''రోజాపై బండారు వ్యాఖ్యలు దారుణం. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా?'' అని కుష్భూ నిలదీశారు. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరని కుష్భూ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారన్నారు.

ఈ విషయంలో మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటిస్తున్నానని కుష్భూ తెలిపారు. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కూడా కలుస్తానని కుష్భూ చెప్పారు.

మహిళల కోసం రిజర్వేషన్‌ బిల్లు(నారీ శక్తి వందన్‌ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా బీజేపీకి చెందిన కుష్భూ.. రోజాకు మద్దతుగా మాట్లాడటంపై చర్చ జరుగుతోంది. కుష్భూ సైతం గతంలో డీఎంకే పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ లోకి వచ్చిన ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇటీవల కుష్భూపైన డీఎంకే నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కుష్భూపైన పలుమార్లు ప్రత్యర్థి పార్టీల నేతలు అసభ్య వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే రోజాకు కుష్భూ మద్దతు ప్రకటించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.