Begin typing your search above and press return to search.

బందర్ తాజ్ మహల్ @ 1800 నాటి ఒక విషాద ప్రేమకథ

అగ్రా తాజ్ మహల్ గురించి తెలియనోళ్లు ఉండరు. ప్రేమకు నిలువెత్తు రూపంలా నిలిచే తాజ్ మహల్ మాదిరి.. ఆంధ్రప్రదేశ్ లోనూ ఒక మహల్ ఉంది.

By:  Tupaki Desk   |   20 July 2025 4:00 PM IST
బందర్ తాజ్ మహల్ @ 1800 నాటి ఒక విషాద ప్రేమకథ
X

అగ్రా తాజ్ మహల్ గురించి తెలియనోళ్లు ఉండరు. ప్రేమకు నిలువెత్తు రూపంలా నిలిచే తాజ్ మహల్ మాదిరి.. ఆంధ్రప్రదేశ్ లోనూ ఒక మహల్ ఉంది. బందర్ లోని ఈ మహల్ ను బందర్ తాజ్ మహల్ గా పిలుచుకుంటూ ఉంటారు. 1800నాటి ఒక విషాద ప్రేమకథకు ఈ భవనం నిలువెత్తు రూపంగా చెప్పాలి. పెళ్లి కోసం తపించిన ఒక ఆంగ్లేయ జంట ఆశలకు ఈ మహల్ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ విషాద ప్రేమకథ చదివిన తర్వాత మనసు చేదెక్కటం ఖాయం. ఇంతకూ ఆ ప్రేమకథేంటి? బందరు తాజ్ మహల్ గా దానికి ఆ పేరెందుకు వచ్చింది? లాంటి వివరాల్లోకి వెళ్లాలంటే దాదాపు రెండు శతాబ్దాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.

అప్పట్లో బ్రిటిష్ పాలన ఉండేది. మద్రాసు ప్రావినెస్సులో భాగమైన నేటి బందర్ ను అప్పట్లో మాసులీపట్నంగా పిలిచేవారు. తర్వాతి కాలంలో మచిలీపట్నంగా పిలవటం తెలిసిందే. క్రిష్ణా జిల్లాలో భాగమైన ఈ ప్రాంతం 1800లలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉండేది. బందరు కోట కెప్టెన్ రాబిన్ సన్ ఆధిపత్యంలో ఉండేది. రాబిన్ సన్ కుమార్తె అరబెల్లా సౌందర్యవతి. కెప్టెన్ రాబిన్ సన్ వద్ద మేజనర్ జనరల్ గా పీటర్ పని చేసేవాడు. అద్భుత సౌందర్యవతి అయిన అరబెల్లా ప్రేమలో పడ్డాడు. తన లవ్ ప్రపోజల్ ను ఆమెకు పంపాడు. పీటర్ గురించి.. అతడి శక్తి సామర్థ్యాల గురించి అవగాహన ఉన్న ఆమె.. అతడ్ని కాదనలేకపోయింది.

అలా వారి లవ్ జర్నీ మొదలైంది. అయితే.. వారిద్దరు పెళ్లి చేసుకుందామని అనుకునే వేళలో.. అరబెల్లా తండ్రి కెప్టెన్ రాబిన్ సన్ నో చెప్పారు. వీరి పెళ్లికి అప్పటి మతాధిపతులు కూడా అడ్డుపడ్డారు. అరబెల్లాతో పెళ్లికి సాధ్యం కాకపోవటంతో.. తన ఇంటికి రావాలని ఆహ్వానించటం.. వారిద్దరూ అప్పట్లోనే సహజీవనం చేసేవారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండటానని అప్పటి సమాజం ఆమోదించలేదు. పీటర్ ను పెళ్లి చేసుకోవాలని ఉందని అరబెల్లా తన తల్లిదండ్రుల్ని ఎన్నిసార్లు అడిగానా.. వారు మాత్రం నో చెప్పారు. దీంతో ప్రియుడు.. తండ్రి మధ్య నెలకొన్న వివాదంతో మానసికంగా కుంగిపోయిన ఆమె అనారోగ్యంతో 1809 నవంబరు ఆరున ప్రేమికుడు పీటర్ చేతిలో కన్నుమూశారు.

ఆమె అంత్యక్రియల్ని బందరుకోటకు దగ్గరగా ఉన్న సెయింట్ జాన్స్ స్మశానంలో సమాధి చేసేందుకు అప్పటి మతపెద్దలు ఒప్పుకోలేదు. దీంతో పీటర్ అనందపేటలో రూ.18వేలతో15 ఎకరాలను కొనుగోలు చేశాడు. ఆమె భౌతికకాయం పాడు కాకుండా ఉండేందుకు ఈజిప్ట్ నుంచి కొన్ని రసాయనాలు.. సుగంధ ద్రవ్యాల్ని తెప్పించి.. ఒక గాజు పెట్టెలో రసాయనాలు.. సుగంధ ద్రవ్యాల్ని పోసి ఆమె భౌతికకాయాన్ని ఉంచారు. అరబెల్లా సమాధి ఉండే ప్రాంగణాన్ని అద్భుతమైన సుందర భవనంగా తీర్చిదిద్దారు.

రెండు శతాబ్దాల క్రితమే అద్భుతమైన టెక్నాలజీని వాడిన పీటర్.. మహల్ లోని శిలాఫలకం పక్కనే ఒక స్విచ్ ను ఏర్పాటు చేశారు. ఆ మీటను నొక్కగానే అండర్ గ్రౌండ్ లో ఉన్న అరబెల్లా భౌతికకాయం ఉంచిన గాజు పెట్టె పైకి వచ్చేది. అలా నిర్జీవంగా ఉన్న అరబెల్లాను చూసుకుంటూ..ఆమెతో గడిపిన మధుర క్షణాల్ని గుర్తు చేసుకుంటూ కుమిలికుమిలి కన్నీరుమున్నీరు అయ్యేవారు. కొన్నాళ్లకు అతను మద్రాసుకు బదిలీ అయ్యారు. తాను చెన్నైకు వెళ్లేటప్పుడు ప్రేయసి మహల్ ను సెయింట్ మేరీస్ చర్చిగా పేరుపెట్టి వెళ్లారు.

మద్రాసు వెళ్లిన అతను తీవ్ర అనారోగ్యంతో 1819లో కన్నుమూశారు. అరబెల్లా.. పీటర్ ప్రేమకథ ఒక విషాదకథలా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటికీ బందరు సెయింట్ మేరీస్ చర్చిలో ప్రతి ఆదివారం సాయంత్రం ప్రార్థనలు జరుగుతాయి అయితే.. 1998లో అరబెల్లా సమాధిని శాశ్వితంగా మూసివేశారు. ఇప్పటికి రసాయనాలతో నిక్షిప్తమైన అరబెల్లా భౌతికకాయాన్ని ఉంచిన గాజుపెట్టె ఇప్పటికి భూగర్భంలో అలానే ఉంది.