స్కూలు బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం... రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
శిల్పకళావేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ "ప్రజలకథే నా ఆత్మకథ" పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
By: Tupaki Desk | 8 Jun 2025 11:31 PM ISTశిల్పకళావేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ "ప్రజలకథే నా ఆత్మకథ" పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దాదాపు కేబినెట్ మంత్రులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైకందుకున్న రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ "ప్రజలకథే నా ఆత్మకథ" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయను కొనియాడారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసినా ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదని అన్నారు.
ఈ సందర్భంగా పదవి ఉన్నా, లేకున్నా బండారు దత్తాత్రేయపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని, పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకూ ఎదిగారని.. సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉందని.. పేదలు చేసుకునే చిన్న చిన్న వేడుకల్లొనూ ఆయన భాగమయ్యేవారని అన్నారు.
తనకు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి.. "నా స్కూల్ చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో.. ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నా అని ఇటీవల ప్రధానికి చెప్పాను" అని తెలిపారు. ఈ సందర్భంగా.. తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఏనాడూ దాచుకోలేదని అన్నారు.
ఈ రోజు మంత్రివర్గ విస్తరణ ఉన్నా ఆ కార్యక్రమం అవ్వగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆయన అజాత శత్రువు అని కొనియాడారు. ఈ సందర్భంగా.. జాతీయ రాజకీయాల్లో వాజ్ పేయికి ఉన్న గౌరవం, రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆయన రెగ్యులర్ గా నిర్వహించే 'అలయ్ బలయ్' కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని అన్నారు.
ప్రధానంగా జంటనగరాల్లో ప్రజలకు కష్టం వస్తే ముందుగా గుర్తుకు వచ్చే నాయకులు పీజేఆర్, దత్తాత్రేయ అని.. తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్ కోసం మాకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారని.. తమ నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు అంతా పాల్గొనడంతో రేవంత్ రెడ్డి ఛలోక్తి విసిరారు!
ఇందులో భాగంగా... ఈ వేడుక గవర్నర్ పరేడ్ లా ఉందని.. కాంగ్రెస్ లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఈ వేదికపైనే ఉందని.. తాను కేబినెట్ మీటింగ్ ఇక్కడే పెట్టుకోవచ్చని రేవంత్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొన్నారు.