Begin typing your search above and press return to search.

బనకచర్లతో తెలంగాణాలో బీజేపీకి కష్టం!

ఇంతకీ బనకచర్ల కధా కమామీషూ ఏమిటి అంటే చాలా ఉంది అని అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు అయితే బనకచర్ల ఒక రాజకీయ డ్రామాగా అభివర్ణిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 8:48 PM IST
బనకచర్లతో తెలంగాణాలో బీజేపీకి కష్టం!
X

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇపుడు బనకచర్ల వివాదం రాజుకుంది. పోలవరం అయిపోయింది. కాళేశ్వరం కూడా ముగిసింది. ఇపుడు కొత్తగా బనకచర్ల వచ్చి చేరింది. నిజానికి ఇది పోలవరానికి అనుబంధం అని ఏపీ పాలకులు చెబుతూంటే కొత్త ప్రాజెక్ట్ అని తెలంగాణా వైపు వాదన వినిపిస్తోంది. మిగులు నీరు అయినా వరద నీరు అయినా బనకచర్ల వల్ల తెలంగాణాకు భవిష్యత్తులో ఇబ్బంది అని తెలంగాణా రాజకీయ పార్టీలు అన్నీ ముక్తకంఠంతో అంటున్నాయి. అయితే అక్కడ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ మాత్రం బనకచర్ల మీద ఒక్క మాట కూడా అనలేని స్థితిలో ఉంది.

ఏపీలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంది. అంతే కాదు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బనకచర్లకు కావాల్సిన అనుమతులు అన్నీ దగ్గరుండి మరీ మంజూరు చేయిస్తోంది అని తెలంగాణా రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ వార్ గా స్టార్ట్ అయినా చివరికి తెలంగాణా బీజేపీ మెడకు ఉచ్చు పడేలా వ్యవహారం సాగుతోంది అని అంటున్నారు.

ఇంతకీ బనకచర్ల కధా కమామీషూ ఏమిటి అంటే చాలా ఉంది అని అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు అయితే బనకచర్ల ఒక రాజకీయ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పక్క పక్కనే ఉండడమే కాదు అప్పులలో కూడా పక్కనే ఉన్నాయని అంటున్నారు. ఏ నెలకు ఆ నెల అప్పు కోసం వెతుక్కునే నేపథ్యం ఉంది. దీంతో కొత్తగా ప్రాజెక్టులు ఎందుకు అన్న చర్చ కూడా ఉంది.

అసలు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే నీరు వాడుకోవచ్చు కదా అన్న చర్చ కూడా ఉంది. పోలవరం ఏపీ విభజన జరిగి పదకొండేళ్ళు పూర్తి అవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. డెడ్ లైన్ ల మీద డెడ్ లైన్లు చాలా మారిపోతున్నాయి. అది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం నుంచి నిధులు రావాలి. ముందుగా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే రీఇంబర్స్మెంట్ ఇస్తారు. అయితే ఆ ఆర్థిక స్తోమత కూడా లేదన్నది కఠినమైన మాటగా ఉంది. తెలంగాణాలోనూ అనేక నీటి ప్రాజెక్టులకు నిధుల కొరత పట్టి పీడిస్తోంది.

ఇలా రన్నింగ్ ప్రాజెక్టులు చూస్తే చాలా లిస్ట్ ఉంది, ముందు వాటిని పూర్తి చేయలేరు కానీ కొత్త ప్రాజెక్టులు ఎందుకు అన్నది నీటి పారుదల రంగం నిపుణుల మాటగా ఉంది. నిజానికి బనకచర్ల ప్రాజెక్టు మూడు దశలలో అవాల్సినది. దాని కోసం ఎన్నో అనుమతులు కావాలి. ఏకంగా 81 వేల కోట్ల రూపాయల నిధులు కావాలి.

అయితే ఏపీ ప్రభుత్వం తన ఆకాంక్షలలో భాగంగా దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీనిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకునేందుకు తెలంగాణాలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద అస్త్రంగా వాడుతోంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ బనకచర్లను ముందుకు తోసింది.

ఇక కాంగ్రెస్ కూడా అంతకు మించి అన్నట్లుగా అఖిలపక్షం పెట్టింది, ఢిల్లీ దాకా వెళ్ళి వచ్చింది. ఏపీతో ఢీ కొడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ తరువాత చర్చలకు కూడా సిద్ధమని అన్నారు. అయితే ఈ మధ్యలోకి బీజేపీని కూడా ఇపుడు లాగుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా బీజేపీ చూస్తోంది. తెలంగాణాలో బీజేపీకి ఎంపీలు ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు. అలాగే ఏపీలో అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఇక కాంగ్రెస్ గురించి చూస్తే ఏపీలో ఆ పార్టీకి ఉనికి పెద్దగా లేదు. అలాగే బీఆర్ ఎస్ పూర్తిగా తెలంగాణా పార్టీ.

దాంతో ఆ రెండు పార్టీలు మాటలతో చెలరేగుతున్నాయి. కానీ రెండు చోట్ల తన బలం ఉన్న బీజేపీకి బనకచర్ల ప్రాణ సంకటంగా మారుతోంది అని అంటున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే వచ్చే ఎనికల్లో రాజకీయ లబ్ది కోసమే బనకచర్ల ఎత్తుకుందని అంటున్నారు. అర్జంటుగా బనకచర్లకు ముందు శంకుస్థాపన చేసి అయినా కధ నడిపించాలని అనుకుంటోంది అని చెబుతున్నారు.

అయితే ఈ మొత్తం మూడు పార్టీలు ఎవరికి వారు రాజకీయంగా సేఫ్ జోన్ లో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ కాచుకుని కూర్చుంది. మధయలో బలి అవుతోంది మాత్రం బీజేపీ అని అంటున్నారు. ఆ పార్టీ ఏపీలో బనకచర్లని సమర్ధిస్తూ తెలంగాణాలో కాదు అనలేదు. అలాగని సైలెంట్ గా సైతం ఉండలేదు. దాంతో ఇపుడు పులుసులో పడింది కమలం పార్టీయే అంటున్నారు. బనకచర్ల మీద రచ్చ ఎంత సాగితే అంత కష్టం నష్టం బీజేపీకే అని అంటున్నారు. మొత్తానికి కాషాయ పార్టీకి కష్టాలు బనకచర్ల రూపంలో రావడం అంటే రాజకీయ విడ్డూరమే అని అంటున్నారు.