బాబు నెత్తిపై ఆశ-నిరాశల 'బనకచర్ల'!
ఏపీ సీఎం చంద్రబాబు తలకెత్తుకున్న కీలక ప్రాజెక్టు బనకచర్ల. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టును కీలకంగా భావించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 17 July 2025 10:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు తలకెత్తుకున్న కీలక ప్రాజెక్టు బనకచర్ల. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టును కీలకంగా భావించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు బనకచర్ల భారాన్ని తలకెత్తుకున్నారు. అయితే.. ఇది అంత ఈజీగా తేలే విషయంగా కనిపించడం లేదు. ఆశ-నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చంద్రబాబు చెబుతున్న విషయాలను తెలంగాణ లైట్ తీసుకుంటోంది. తూచ్.. అని అనేస్తోంది. ఇక, జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తోంది.
మీరు మీరు ఏమైనా చేసుకోండి.. మేం చూస్తూ కూర్చుంటాం! అన్నట్టుగా కేంద్రం పాత్ర స్పష్టమవుతోంది. ఇప్పుడు సోమవారం.. దీనిపై కమిటీ వేస్తున్నట్టు ఏపీ నాయకులు ప్రకటించగా.. అలాంటిదేమీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే స్పష్టం చేశారు. సో.. దీనిని బట్టి అసలు బనకచర్ల వ్యవహారం తేలేదెన్నడు? అనేది ప్రధాన ప్రశ్న. మరోవైపు.. ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసినా.. రేవంత్ రెడ్డికి రాజకీయంగా భోగిమంటలు చెలరేగడం ఖాయమనే తెలుస్తోంది.
ప్రతిపక్షం మాట దేవుడెరుగు.. సొంత పార్టీలోనే బనకచర్లపై 70:30 అన్నట్టుగా నాయకులు చీలిపోయారు. బనకచర్లను సమర్ధించేవారు.. 30 శాతం మంది ఉండగా.. 70 శాతం మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలు కూడా.. కీలక ప్రాజెక్టుపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు.. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చే గోదావరి నీటిపై.. భారీ ప్రాజెక్టులు కట్టుకునేందుకు కేంద్రమే అనుమతి, నిధులు కూడా ఇచ్చేస్తోంది. ఇది కూడా చంద్రబాబు నిరాశగా మారింది.
ఎందుకంటే.. ఆయా రాష్ట్రాల్లోనే గోదావరి జలాలను.. సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తే.. ఏపీకి వచ్చేసరికి మిగులు జలాల సంగతి తగ్గిపోతుంది. ఇక, ఈ మిగులులోనూ.. తమకు వాటా కావాలని తెలంగాణ పట్టుబడుతోంది. మిగులుపై చివరి రాష్ట్రానికి మాత్రమే హక్కు ఉంటుందన్న చంద్రబాబు వాదన ఏమేరకు నిలుస్తుందన్నది కూడా ప్రశ్నగా మారింది. ఇక, ఇప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమైనా.. అనేక వివాదాల మెట్లు దిగి.. చివరకు వచ్చేసరికి.. కనీసంలో కనీసం రెండేళ్లయినా పడుతుంది.సో.. ఎలా చూసుకున్నా.. ఇది బాబుకు పెను భారంగా మారడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
