Begin typing your search above and press return to search.

'ఆపరేషన్ బామ్..' పాక్ పీకపై బలూచ్ బాంబు.. 9 మంది హతం

ఉగ్రవాదానికి పెద్దన్న లాంటి పాకిస్థాన్ కు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది.

By:  Tupaki Desk   |   11 July 2025 5:00 PM IST
ఆపరేషన్ బామ్.. పాక్ పీకపై బలూచ్ బాంబు.. 9 మంది హతం
X

ఉగ్రవాదానికి పెద్దన్న లాంటి పాకిస్థాన్ కు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. వరుస దాడులతో వణికిస్తోంది. ప్రత్యేక దేశం ఏర్పాటే లక్ష్యంగా పోరాడుతున్న ఈ రెబెల్స్ తాజాగా భారీ విధ్వంసానికి దిగారు. పాక్ లోని అతిపెద్ద ప్రావిన్స్ (రాష్ట్రం) బలూచిస్థాన్. ఎప్పటినుంచో స్వాతంత్ర్యం కోసం పోరాడుతోంది. బీఎల్ ఏ దాదాపు సమాంతర ప్రభుత్వం నడుపుతోంది.

ప్రావిన్స్ దక్షిణ ప్రాంతంలో బలూచ్ ఆర్మీ.. వాహనాలపై దాడి చేసింది. కొందరిని బందీలుగా పట్టుకుని పర్వత ప్రాంతాల్లోకి తీసుకెళ్లింది. వీరిలో 9 మందిని కాల్చి చంపింది. ఇది జరిగింది గురువారం సాయంత్రమే. అయితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులను ఆపి కిడ్నాప్ లకు పాల్పడ్డ బీఎల్ఏ మిలిటెంట్లు పర్వతాల్లోకి తీసుకెళ్లి హత్య చేశారు.

ఘటన జరిగింది బలూచ్ లోనే అయినా.. పాల్పడింది ఎవరూ అనేది ఇంతవరకు ప్రకటించుకోలేదు. అయితే, ఎక్కువ శాతం బలూచ్ రెబల్స్ కే ఇలాంటి ఉదంతాల చరిత్ర ఉంది. ఇక కిడ్నాప్ కు గురైనవారిలో పంజాబ్ ప్రావిన్స్ వారే అధికంగా ఉన్నారని చెబుతున్నారు.

పంజాబ్ ప్రావిన్స్ అంటే బలూచ్ ఆర్మీకి తీవ్రమైన ద్వేషం. దేశంలో రాజకీయ, ఆర్థిక పెత్తనం అంతా ఈ ప్రావిన్స్ వారి ఆధీనంలో ఉండడమే దీనికి కారణం. ఇక బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొన్ని రోజుల కిందట రైలునే హైజాక్ చేసిన సంగతి తెలిసిందే.

మంగళవారం నుంచి పాక్ సర్కారుపై అతిపెద్ద దాడిని మొదలుపెట్టింది. దీని పేరు ‘ఆపరేషన్ బామ్‘. దీంట్లో భాగంగా చాలా జిల్లాల్లో ప్రభుత్వ, సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. మొత్తం 17 చోట్ల దాడులు చేసింది. తమ సంస్థ చరిత్రలోనే కొత్త అధ్యాయంగా పేర్కొంటోంది. మరి ఈ రచ్చ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.