Begin typing your search above and press return to search.

పార్టీ ఫండ్ కోసం డబ్బులు తీసుకున్నా.. లంచాలు కాదన్న బాలినేని

మంత్రిగా ఉన్నప్పుడు తాను కొందరి వద్ద డబ్బులు తీసుకున్నానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

By:  Tupaki Desk   |   11 Dec 2023 4:58 AM GMT
పార్టీ ఫండ్ కోసం డబ్బులు తీసుకున్నా.. లంచాలు కాదన్న బాలినేని
X

సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి వచ్చారు ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం అప్పు చేసైనా సరే.. వారి కష్టాలు తీర్చే అలవాటు ఉన్ననేతగా ఆయనకు పేరుంది. విషయం ఏదైనా.. అదెలాంటిదైనా సరే.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. నిజాన్ని నిర్బయంగా ఒప్పుకునే దోరణిలో ఆయనలో ఎక్కువగా చెబుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని లక్షలాది రూపాయిల బెట్ కాశానన్న మాటను ఓపెన్ గా చెప్పేయటమే కాదు.. తన కొడుకు బాధ పడుతున్నాడని ఆ బెట్ నుంచి వెనక్కి తగ్గిన వైనం తెలిసిందే. ఇలా విషయం ఏదైనా సరే.. ముఖం మీద చెప్పేసే అలవాటున్న ఆయన ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

మంత్రిగా ఉన్నప్పుడు తాను కొందరి వద్ద డబ్బులు తీసుకున్నానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన మీడియా సమావేశాన్నినిర్వహించి మరీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నది పార్టీ ఫండ్ తప్పించి లంచాలు కాదన్నారు.

అయిదుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా పని చేసిన తనకు.. తమ తాతలు.. తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని అమ్మేయాల్సి వచ్చిందని చెప్పారు. అంతేకాదు.. ప్రస్తుతం తనకు రూ.15 కోట్ల అప్పు ఉందన్న బాలినేని.. ఆ మొత్తాన్ని టీడీపీ వారి నుంచి అప్పుగా తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. తన మాటలకు వక్రభాష్యాలు పలుకుతున్నారని.. లేనిపోని మాటల్ని చెబుతున్నారన్నారు.

ల్యాండ్ సీలింగ్ యాక్టులో చాలావరకు భూములను పేదలకు రాసిచ్చిన చరిత్ర తమకుందన్న ఆయన.. తన దగ్గర పది రూపాయిలుఉంటే.. మరో ఇరవై రూపాయిలు అప్పు చేసి మరీ పేదలకు రాసిచ్చే గుణం తనదన్నారు. ఇలాంటి తనపై ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేస్తున్నాయన్నారు. తనపై బురదజల్లేలా కుట్ర చేస్తున్నారంటూ టీడీపీ.. జనసేన వర్గీయులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై చేస్తున్న విమర్శలపైనా ఆయన ధీటుగా స్పందించారు.

తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్ హెలికాఫ్టర్ లో వచ్చారంటూ విమర్శలు చేస్తున్నారని.. గతంలో ఇలాంటి విపత్తుల వేళలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిల్ మీద వచ్చి బాధితుల్ని పరామర్శించారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. తుపాను నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్ అలెర్టు చేయటంతో పాటు.. ముందుగా నిధులు ఇవ్వటంతో విపత్తును సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన కోసం కార్యకర్తలు సరిగా పని చేయలేదన్న తన మాటలతో వారు బాధ పడ్డారని.. తన వ్యాఖ్యలు కేవలం.. తాము అధికారంలో ఉన్నామన్న నిర్లక్ష్యాన్ని విడనాడాలన్న ఉద్దేశంతో మాత్రమే తానీ వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొన్నారు.