బాలినేని ఫ్యూచర్ ప్లాన్స్ అదుర్స్ !
తొలుత కాంగ్రెస్ లో ఆ మీదట వైసీపీలో తన హవాను బలంగా చాటుకుని ఒంగోలు జిల్లా రాజకీయాల్లో దిగ్గజ నేతగా ఎదిగిన వారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
By: Satya P | 22 May 2026 9:37 AM ISTతొలుత కాంగ్రెస్ లో ఆ మీదట వైసీపీలో తన హవాను బలంగా చాటుకుని ఒంగోలు జిల్లా రాజకీయాల్లో దిగ్గజ నేతగా ఎదిగిన వారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు నుంచి ఆయన మొత్తం అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా మొత్తాన్ని హోల్డ్ చేసి పార్టీని నడిపించిన నాయకత్వం ఆయనకు ఉంది. వైసీపీలో బాలినేని రాజకీయం సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బాలినేని బయటకు రావడం అలాగే జనసేనలో చేరడం జరిగిపోయాయి. జనసేనలో మొదట్లో బాలినేని రాక కూటమిలో కొంత గ్యాప్ క్రియేట్ చేసినా అనుభవం కలిగిన నేత కాబట్టి జాగ్రత్తగానే సర్దుకున్నారు. ఇపుడు తన రూటునూ సీటునూ కూడా ఆయన చూసుకుని ఫ్యూచర్ పాలిటిక్స్ కి మాస్టర్ ప్లాన్ ని రెడీ చేసుకున్నారు అని అంటున్నారు.
బాబుతో భేటీ :
ఇదిలా ఉంటే బాలినేని తాజాగా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఆయన జనసేనలో చేరి చాలా కాలం అయినా ఎప్పుడూ చంద్రబాబుని కలిసిన సందర్భం లేదు. అలాంటిది అనూహ్యంగా ఆయన ఈ భేటీ వేయడంతో ఒంగోలు రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏమిటి అన్న చర్చ స్టార్ట్ అయింది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ తో సుదీర్ఘమైన చర్చలు జరిపిన బాలినేని త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు జిల్లాలో జనసేన అభ్యర్ధులను గెలిపించుకుని వస్తాను అని అధినాయకత్వానికి హామీ ఇచ్చి గట్టి పట్టుదల మీద ముందుకు సాగుతున్నారు.
అక్కడ నుంచి పోటీ :
ఇక బాబుతో భేటీ ద్వారా 2029 ఎన్నికల్లో బాలినేని తాను పోటీ చేయదలచుకున్న సీటు విషయంలో చర్చించి ఉంటారని అంటున్నారు. ఆయన ఒంగోలు జిల్లా దర్శి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని ప్రచారం అయితే తాజాగా మొదలైంది. దర్శి అన్నది వరసగా మూడు ఎన్నికల నుంచి వైసీపీ చేతిలోనే ఉంది. 2014 నుంచి ఆ పార్టీ అక్కడ గెలుస్తోంది. వైసీపీకి బలమైన ఈ సీటులో ఈసారి జనసేన తరఫున బాలినేని పోటీకి దిగుతారు అని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు రెడ్లు కలిపి ఉన్నారు. దాంతో జనసేనకు పొత్తులో ఈ సీటు వదిలేస్తే గెలిచి వస్తాను అని బాలినేని ప్రతిపాదన పెట్టారని దానికి జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టీడీపీ నుంచి కూడా సుముఖత వ్యక్తం అయ్యింది అంటున్నారు.
టీడీపీ తమ్ముళ్ళ గుర్రు :
ఇదిలా ఉంటే దర్శిలో దశాబ్దాలుగా టీడీపీ జెండాను మోస్తూ వస్తున్న పార్టీ నేతలు ఉన్నారు. వారంతా ఒంగోలు నుంచి బాలినేని వస్తే తమ సంగతేంటని అంటున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే దర్శి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి స్థానికంగా సమస్యలు ఎలా ఉన్నా బాలినేని విషయంలో జనసేన టీడీపీ అగ్ర నాయకత్వాలు పచ్చ జెండా ఊపాయని అంటున్నారు. ఆ విధంగా తన పోటీకి తన సీటుకీ బాలినేని సేఫ్ జోన్ ఎంచుకున్నారని చెబుతున్నారు. తొందరలోనే బాలినేనిని దర్శికి ఇంచార్జిగా జనసేన నియమిస్తుందని అంటున్నారు. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒంగోలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఉన్నారు. ఆయంతో బాలినేని డైరెక్ట్ ఫైట్ కి దిగుతారు అని అంటున్నారు. అంగబలం అర్ధబలం అన్నీ ఉన్న బాలినేని కూటమి పొత్తుతో ఈ సీటు నుంచి సునాయాసంగా గెలిచేందుకు ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు.
