శుభం.. బాలినేని అదృష్టం పండింది ..!
ఔను.. ఒంగోలు రాజకీయ నాయకుల్లో ఇదే చర్చ సాగుతోంది. ఏ ఇద్దరు కలుసుకున్నా.. బాలినేని అదృ ష్టం పండిందనే చెబుతున్నారు.
By: Tupaki Desk | 5 July 2025 3:06 PM ISTఔను.. ఒంగోలు రాజకీయ నాయకుల్లో ఇదే చర్చ సాగుతోంది. ఏ ఇద్దరు కలుసుకున్నా.. బాలినేని అదృ ష్టం పండిందనే చెబుతున్నారు. ప్రస్తుతం జనసేనలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి.. ఆ పార్టీ అధినేత అభయం ప్రసాదించారని అంటున్నారు. త్వరలోనే ఆయనకు కీలకమైన శుభవార్త అందుతుందని చెబుతున్నారు. దీనిపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం గత ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన బాలినేని జనసేనలో చేరారు.
నేరుగా ఆయన జనసేన నాయకులు నాగబాబు, పార్టీ చీఫ్ పవన్‌ను కలిసి.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో ఆయన ఎమ్మెల్సీసీటు కావాలని కోరారన్న ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పటి వరకు నెరవేరలేదు. సుమారు 8 మాసాలుగా బాలినేని ఎదురు చూస్తున్నారు. కానీ.. దీనిపై క్లారిటీ రాలేదు. తాజాగా ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్.. చివరి నిముషంలో బాలినేనిని ఆకాశానికి ఎత్తేశారు. ఆయనను తనకు అత్యంత ఆప్తుడిగా పేర్కొన్నారు.
చాలా నిఖార్సయిన రాజకీయ నాయకుడిగా కూడా పవన్ ప్రశంసించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తనకు ఎంతో సాయం చేశారని.. బాలినేని గురించి పవన్ చెప్పడం గమనార్హం. అనంతరం.. ఇరువురు నాయకులు రెండు నిమిషాల పాటు.. ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ఈ చర్చల తర్వాతే.. బాలినేని అదృష్టం పండిందన్న వాదన బయటకు వచ్చింది. అంటే.. దీనిని బట్టి.. త్వరలోనే బాలినేనికి ఎమ్మెల్సీ చాన్స్ దక్కే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అయితే.. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
ఇదిలావుంటే.. స్థానికంగా బాలినేనిని వ్యతిరేకిస్తున్న జనసేన నాయకుడు కాశీనాథ్ సహా కొందరికి పవన్ కల్యాణ్.. పరోక్షంగానే బాలినేని వాల్యూ తెలిసేలా కామెంట్లు చేశారు. బాలినేని చాలా ముఖ్యనాయకుడని.. ఆయనతో తనకు ఎంతో పరిచయం ఉందని వ్యాఖ్యానించారు. తద్వారా.. ఇప్పటి వరకు బాలినేని విమర్శిస్తూ వచ్చిన నాయకులను పవన్ కంట్రోల్ చేసినట్టు అయింది. దీంతో ఇప్పటి వరకు పార్టీ మారినా.. పెద్దగా దూకుడు లేని బాలినేని ఇక నుంచి యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా.. పవన్ ప్రకాశం పర్యటన.. బాలినేనిని ఖుషీ చేసిందన్నది వాస్తవం.
