నేపాల్‌లో బాలెన్ షా ప్రభంజనం: భారత్‌కు కొత్త అవకాశాలా.. సవాళ్లా?
గతేడాది నేపాల్‌ను కుదిపేసిన జెన్-జీ ఉద్యమం ఆ దేశ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి.
By: A.N.Kumar | 7 March 2026 12:20 PM ISTనేపాల్ రాజకీయ యవనికపై ఒక కొత్త శకం ఆరంభమైంది. సంప్రదాయ రాజకీయ శక్తులైన నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు గట్టి షాక్ ఇస్తూ యువనేత బాలెన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. మార్చి 5న జరిగిన ఎన్నికల్లో 165 స్థానాలకు గాను ఇప్పటికే 94 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతున్న ఈ "యువ కెరటం" నేపాల్ భవిష్యత్తునే కాకుండా, భారత్-నేపాల్ సంబంధాల గమనాన్ని కూడా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి.
జెన్-జీ ఉద్యమం నుండి అధికార పీఠం వరకు..
గతేడాది నేపాల్‌ను కుదిపేసిన జెన్-జీ ఉద్యమం ఆ దేశ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. అవినీతి, నిరుద్యోగం, పాతతరం నాయకుల అసమర్థతపై యువత తిరగబడటంతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పతనమైంది. ఆ క్రమంలో సుశీల కార్కీ తాత్కాలిక బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఎన్నికల వరకు నడిపించారు. సరిగ్గా ఇదే అసంతృప్తిని బాలెన్ షా తన రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్నారు. కాట్మండు మేయర్‌గా తన పనితీరుతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు జాతీయ స్థాయిలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు.
భారత్ పట్ల బాలెన్ షా వైఖరి: ఆందోళన కలిగించే అంశాలేమిటి?
బాలెన్ షా ఒక గట్టి జాతీయవాది. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ముఖ్యంగా సరిహద్దు వివాదాలు.. సాంస్కృతిక అంశాలపై ఆయన ప్రదర్శించిన దూకుడు భారత్‌లో కొంత ఆందోళన కలిగించింది. తన కార్యాలయంలో "గ్రేటర్ నేపాల్" మ్యాప్‌ను ప్రదర్శించడం ద్వారా ఆయన తన జాతీయవాద ముద్రను బలంగా వేశారు. దీనివల్ల ఆయన "భారత వ్యతిరేకి" అనే ముద్ర పడేలా చేసింది. అయితే దౌత్యవేత్తల విశ్లేషణ ప్రకారం.. ఇది కేవలం దేశీయ ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప, భారత్‌తో శాశ్వత విరోధం కాకపోవచ్చు.
చైనాకు చెక్.. భారత్‌కు ఊరట?
గతంలో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం చైనాకు పూర్తిగా అనుకూలమైన విధానాలను అనుసరించడం భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే బాలెన్ షా తన మేనిఫెస్టోలో "సమతుల్య విదేశాంగ విధానం" గురించి స్పష్టంగా పేర్కొన్నారు. షా ప్రభుత్వం చైనా పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. ఇది భారత్‌కు వ్యూహాత్మకంగా కలిసొచ్చే అంశం. భారత్– చైనాల మధ్య సమాన దూరం పాటిస్తూనే నేపాల్ ప్రయోజనాలే పరమావధిగా సాగాలని ఆయన భావిస్తున్నారు. ఇది "చైనా వైపు మొగ్గు" అనే పాత ధోరణి కంటే భారత్‌కు మెరుగైన పరిస్థితే.
ఆర్థిక , సాంస్కృతిక బంధం: కొత్త మార్పులు
నేపాల్ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఒక లైఫ్ లైన్. ఓపెన్ బోర్డర్ ద్వారా జరుగుతున్న వాణిజ్యం, పర్యాటకం, లక్షలాది మంది నేపాలీలు భారత్‌లో ఉపాధి పొందడం వంటివి విడదీయలేని బంధాలు. నేపాల్‌లో జలవిద్యుత్ ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కీలకం. షా ప్రభుత్వం ప్రాజెక్టుల వేగవంతానికి మొగ్గు చూపితే రెండు దేశాలకు లాభదాయకం. గతంలో అగ్నివీర్ పథకంపై నెలకొన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కొత్త ప్రభుత్వం ఒక అవకాశంగా మారవచ్చు. కాలాపానీ, లిపులేఖ్ వంటి అంశాలపై చర్చలు జాతీయవాద ధోరణి వల్ల కొంత క్లిష్టంగా మారవచ్చు.. కానీ దౌత్యపరమైన పరిష్కారాలకు బాలెన్ షా మొగ్గు చూపే అవకాశం ఉంది.
సవాళ్ల మధ్య ఒక కొత్త ఆశ
బాలెన్ షా ఆధిక్యం భారత్‌కు ఒకేసారి సవాలును, అవకాశాన్ని రెండింటినీ ఇస్తోంది. ఆయన జాతీయవాదం భారత్‌కు కొంత ఇబ్బందికరంగా అనిపించినా, చైనాకు పూర్తిగా లొంగిపోని ఆయన స్వతంత్ర వైఖరి భారత్‌కు అనుకూలాంశం. నేపాల్‌లో స్థిరమైన, యువత ఆకాంక్షలకు తగ్గట్టుగా నడిచే ప్రభుత్వం ఉంటే అది సరిహద్దు భద్రతకు, ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేస్తుంది.
ఢిల్లీ పెద్దలు ఈ మార్పును ఒక ముప్పుగా చూడకుండా, ఒక కొత్త భాగస్వామిగా బాలెన్ షాను ఆహ్వానిస్తూ, సానుకూల దౌత్యం వైపు అడుగులు వేయడం ప్రస్తుత తక్షణావశ్యం. నేపాల్‌లో "బాలెన్ ప్రభంజనం" భారత్‌తో స్నేహానికి అడ్డుగోడ కాదు, పాత గాయాలను మాన్పి కొత్త బంధాన్ని నిర్మించే వంతెన కావాలని ఆశిద్దాం.
