Begin typing your search above and press return to search.

బాలయ్యా...ఇదేం గోలయ్యా..!?

అయితే మొదటి రోజే అభిమాని మీద బాలయ్య చేయి చేసుకున్నాడు అంటూ వార్తలు రావడంతో టీడీపీ కలవరపడుతోంది.

By:  Tupaki Desk   |   14 April 2024 4:10 AM GMT
బాలయ్యా...ఇదేం  గోలయ్యా..!?
X

బాలయ్యకు మంచి అభిమాన గణం ఉంది. ఆయన ఎక్కడికి వచ్చినా వారు వస్తూంటారు. బాలయ్య కూడా వారితో కలసిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయనకు ఏమైనా చికాకు కలిగితే మాత్రం అభిమాని అని చూడకుండా చేయి చేసుకుంటారు. ఇది ఎన్నో సారి అని అడగవద్దు అది అలా జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్ గా కదిరిలో బాలయ్య హెలిపాడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

బాలయ్య సోలోగా రధాన్ని ఒకటి ఎంచుకుని మరీ జనంలోకి వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిరంతరంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఏపీ అంతా తిరగాలని వ్యూహంగా ఉంది. బాలయ్యకు రాయలసీమలో పెద్ద ఫ్యాన్ మెయిల్ ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో వైసీపీని నిలువరించి టీడీపీకి అనుకూలం చేయడానికి బాలయ్య టూర్ ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది.

అయితే మొదటి రోజే అభిమాని మీద బాలయ్య చేయి చేసుకున్నాడు అంటూ వార్తలు రావడంతో టీడీపీ కలవరపడుతోంది. ఇది కోరి కోరి ఏపీలో వైసీపీకి ఆయుధంగా మారుతుందని కూడా అనుకుంటోంది. బాలయ్య ఆవేశం ఆనందం అన్నీ కూడా ఎక్కడా దాచుకోరు. గతంలో కూడా ఆయన ఇదే అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ అభిమానుల మీద చేయి చేసుకున్నారు.

ఇపుడు సమయం చాలా కీలకం. అందుకే టీడీపీలో ఆందోళన కనిపిస్తోంది. నిజానికి బాలయ్య ప్రసంగాల్లో ఏమేమి మాట్లాడుతారు వాటిని ఎలా వైసీపీ పట్టుకుని ట్రోల్స్ చేస్తుంది అన్న బెంగ ఒక వైపు ఉండనే ఉందిట.దాంతో పాటు ఇపుడు ఈ తరహా ఘటనలు పెరిగితే రాజకీయ లాభం అటుంచి నష్టం వస్తుందని అంటున్నారు.

అయినా బాలయ్య తమాయించుకోవాలి కదా అన్నది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తున్న సూచనలు. ఒకప్పటి ప్రపంచం కాదు ఇది ప్రతీ వారి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నారు. ఒక్కసారి ఎవరైనా బయటకు వస్తే కోటి కెమెరా కళ్ళ మధ్యన ఉన్నట్లే. మంచి చేస్తే వైరల్ చేయరేమో కానీ ఏదైనా నెగిటివ్ గా వస్తే మాత్రం దాన్ని క్షణాల్లో ప్రపంచం మొత్తం దాటించేస్తారు.

దాంతో బాలయ్య ప్రచారం చేయడం పట్ల పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తూనే కాస్తా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం అంటున్నారు. అయినా బాలయ్య ఇదేంది గోలయ్యా అని అంటున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినీ కెరీర్ అద్భుతంగా సాగుతోంది. అన్ స్టాపబుల్ అంటూ ఆయన చేస్తున్న సందడి తో ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోయింది.

అలాగే హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచేందుకు అన్నీ అనుకూలిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏ చిన్న తప్పు చేసినా ఆయనకు వ్యక్తిగతంగానే కాదు పార్టీకి ఇబ్బంది వస్తుందని అంటున్నారు. బాలయ్య తెలిసి ఏమీ చేయరు. పైగా ఆయనకు ఎవరి మీద ఏ కోపమూ ఉండదు. అంతా భోళాగా ఉంటారు. కానీ ప్రత్యర్ధులకు అదే ఆయుధం అవుతుంది అనుకున్నపుడు మాత్రం చాలా చాలా కేర్ గా ఉండాలని అంటున్నారు.