Begin typing your search above and press return to search.

అసెంబ్లీ దేవాలయం అంటూ.. బాలయ్యా ఆ సంజ్ఞలేందయ్యా...!

ఆ టైం లో బాలయ్య సభలో అధికార పక్ష సభ్యుల వైపు చూస్తూ చేసిన అసభ్య సంజ్ఞ నిజంగా సభ్యసమాజం తలదించుకునేలా ఉందనే అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Sep 2023 1:15 PM GMT
అసెంబ్లీ దేవాలయం అంటూ..  బాలయ్యా ఆ సంజ్ఞలేందయ్యా...!
X

బాలయ్యది ఘనమైన వారసత్వం. ఆయన తండ్రి మేరు నగ ధీరుడు ఎన్టీయార్ . ఆయన ముఖ్యమంత్రిగా ఎపుడూ హుందాగానే ఉండేవారు, విపక్షంలో సైతం ఆయన ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించలేదు. అలాంటిది అన్న గారు కుమారుడిగా బాలయ్య హిందూపురం నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలిచారు.

ఆయన గత తొమ్మిదిన్నర కాలంలో ఎపుడూ సభలో పెద్దగా సందడి చేసింది లేదు. కానీ చంద్రబాబు అరెస్ట్ తరువాత బాలయ్య అసెంబ్లీకి వచ్చారు. ఆవేశంతో ఊగిపోయారు. ఆయన మంత్రి అంబటి రాంబాబుని పిలిచి సవాల్ చేశారు. మీసాలు మెలేశారు.

సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఆ టైం లో బాలయ్య సభలో అధికార పక్ష సభ్యుల వైపు చూస్తూ చేసిన అసభ్య సంజ్ఞ నిజంగా సభ్యసమాజం తలదించుకునేలా ఉందనే అంటున్నారు.

బాలయ్య అసభ్య సంజ్ఞల వీడియోను బయటకు అధికార పక్షం వారు వదిలారు. బ్లాక్ అండ్ వైట్ లో చూపించినా కూడా బాలయ్య చేసిన సంజ్ఞ వెనక ఉన్న అతి పెద్ద బూతు ఏంటో అందరికీ అర్ధం అయిపోయింది. బయటకు వచ్చి బాలయ్య మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ దేవాలయం అన్నారు. పవిత్రమైన చోటు అన్నారు. మరి అంతటి పవిత్రమైన చోట అలా అసభ్య సంజ్ఞ ఎలా చేయాలనిపించింది బాలయ్యా అంటే ఆయనకు జవాబు ఉంటుందా అంటున్నారు.

అఫ్ కోర్స్ అధికార పక్షం వారు రెచ్చగొట్టవచ్చు. తన బావ టీడీపీ నేత అరెస్ట్ అయి జైలులో ఉన్నారన్న బాధ ఆక్రోశం ఉండవచ్చు, కానీ శాసనసభలో ఎలా నడచుకోవాలో తొమ్మిదిన్నరేళ్ల పాటు మెంబర్ గా ఉన్న బాలయ్యకు తెలియదా అంటున్నారు ఇక బాలయ్య ఆషామాషీ నేత కాదు కదా. ఆయన ప్రముఖ నటుడు, ఘనమైన వారసత్వం ఉన్న వారు.

అలాంటి బాలయ్య అలా అసభ్య సంజ్ఞలు చేస్తే ఏపీలోని మహిళా లోకం ముందు ఏ విధంగా అవి కనిపిస్తాయన్న ఆలోచన చేశారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బాలయ్య తన కోపం వైసీపీ వారి మీద ప్రదర్శించాను అనుకుంటున్నారు కానీ తన వ్యక్తిత్వం కూడా అందులో కనిపిస్తుంది అనుకోవడం లేదు అంటున్నారు.

బాలయ్య నిజంగా టీడీపీలో హైలెట్ కావాలని చూస్తున్నారు అని అంటున్నారు. బావ తరువాత తాను అన్నట్లుగా ఆయన దూకుడు చేస్తున్నారు టీడీపీలో నాయకత్వ సమస్య ఉంది. ఇదే అదనుగా తాను నిరూపించుకోవాలని ఆయన తపన పడుతున్నారు అని అంటున్నారు. అయితే బాలయ్య వంటి వారు ఆరు పదుల వయసు దాటిన వారు నాయకత్వం తీసుకోవాలంటే దానికి తగిన విధంగా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇలా అసభ్య సంజ్ఞలతో బాలయ్య తనను తానే తక్కువ చేసుకున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ కి కూడా ఇలాంటి చర్యలు మచ్చ తెప్పిస్తాయన్న విషయం మరచిపోతే ఎలా అంటున్నారు. ఇదిలా ఉంటే నాడు వైసీపీ విపక్షంలో ఉన్నపుడు రోజా ఇలాగే అసభ్యంగా సంజ్ఞ ఏదో చేశారు అని ఆమెను ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇపుడు బాలయ్య మీద కూడా అసెంబ్లీ సీరియస్ యాక్షన్ దిశగా ఆలోచిస్తుందా అన్నది చర్చకు వస్తోంది. అదే కనుక జరిగితే బాలయ్యకు ఇబ్బందే అంటున్నారు.