Begin typing your search above and press return to search.

నందమూరికి దక్కిన న్యాయం

1949లో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు 1982 దాకా నాన్ స్టాప్ గా నటిస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Jan 2025 11:09 PM IST
నందమూరికి దక్కిన న్యాయం
X

నందమూరి వారి నటనకు 2024తో 75 ఏళ్ళు నిండాయి. ఆ ఇంట పూచిన చిగురాకు కొమ్మ కూడా నటనలు నేరుస్తుంది అన్నది నిజమైంది. 1949లో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు 1982 దాకా నాన్ స్టాప్ గా నటిస్తూనే ఉన్నారు. ఆ వారసత్వాన్ని బాలయ్య ఈ నాటికీ కొనసాగిస్తూ వస్తున్నారు.

ఆయన 300కి పైగా చలన చిత్రాలలో నటించారు. అందుకు గానూ ఆయనకు దక్కిన పౌర పురస్కారం ఒకే ఒక్కటి. 1968లో పద్మశ్రీ అవార్డు మాత్రమే ఆయనను వరించింది. నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా కధా రచయితగా స్క్రీన్ ప్లే రైటర్ గా జానపద పౌరాణిక, చారిత్రాత్మక సాంఘిక చిత్రాలలో ఎన్నో వందల పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి రామ రావణుల పాత్రలతో పాటు కీచక కర్ణ దుర్యోధన క్రిష్ణ పాత్రలతో సైతం మెప్పించిన ఎన్టీఆర్

నటనా కౌశలానికి ఆయన తెలుగు జాతికి అందించిన కళా సంపదకు తగిన గుర్తింపు అయితే దక్కలేదు.

అయితే ఆయన కుమారుడిగా నట వారసుడిగా 1974లో సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య తండ్రి లాగానే జానపద పౌరాణిక చారిత్రాత్మక సాంఘిక చిత్రాలలో ఎన్నో పాత్రలు పోషించారు. బాలయ్యకు ఎన్టీఆర్ లాగానే ఒక అనుకూలత ఉంది. ఆయన ఆంగికం ఏ పాత్రకైనా సూట్ అవుతుంది. అలాగే ఆయన వాచకం కూడా ఆయా పౌరాణిక పాత్రలకు తగిన విధంగా సరిపోతుంది. అందుకే బాలయ్య తండ్రికి తగిన తనయుడిగా సినీ రంగంలో రాణిస్తూ అర్ధ శతాబ్దం కాలాన్ని సినీ రంగంలో పూర్తి చేసుకున్నారు.

నందమూరి వారి ఇంట పద్మశ్రీతో ఆగిన పౌర పురస్కారాన్ని పద్మభూషణ్ దాకా చేర్చిన ఘనత అచ్చంగా బాలయ్యదే. ఆ విధంగా నందమూరి వారి నటనకు న్యాయం చేకూరుతుంది అని అంతా అంటున్న నేపథ్యం ఉంది. ఇక మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తాత బాబాయ్ ల మాదిరిగా సినీ సీమలో తనదైన శైలితో రాణీస్తున్నారు. ఆయన ట్రిపుల్ ఆర్ తో ఏకంగా అంతర్జాతీయ నటుడు అయ్యారు.

ఈ విధంగా తెలుగు సినీ సీమకు నందమూరి వంశం చేస్తున్న చిరకాల సేవలకు గానూ దక్కిన పురస్కారంగా పద్మభూషణ్ ని భావించాలి. ఈ పురస్కారానికి బాలయ్య నూరు శాతం అర్హుడు అనడమో ఎలాంటి సందేహమూ లేదు. తనకు దక్కిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ తన సినీ జీవితంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి అశేష జనాలను విశేషంగా మెప్పించిన బాలయ్యకు పద్మ అవార్డు దక్కడం పట్ల అంతా అభినందిస్తున్నారు.

ఆయన ఆరు పదుల వయసులోనూ అంతే ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఈ రోజుకీ సీనియర్ హీరోలలో వరస సక్సెస్ లను చూస్తున్న ఈ శుభ సందర్భంలో ఈ ఘనమైన పౌర పురస్కారం దక్కడం నిజంగా ఆయనతో పాటు అభిమానులకూ అసలైన సంక్రాంతి పండుగ అని అంటున్నారు.