జేసీబీ స్టీరింగ్ పట్టి...బాలయ్యా గోలయ్యా !
నందమూరి బాలక్రిష్ణ. ఆయన అంటేనే సందడి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ హుషార్.
By: Satya P | 19 Feb 2026 11:25 PM ISTనందమూరి బాలక్రిష్ణ. ఆయన అంటేనే సందడి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ హుషార్. ఉత్సాహానికి మారు పేరుగా బాలయ్య ఉంటారు. సినిమా షూటింగుల్లో సైతం బాలయ్య సెట్ లో ఉంటే ఆ జోష్ వేరే లెవెల్ అని చెబుతారు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కూడా లాబీల్లో హడావుడి చేసిన బాలయ్య ఇపుడు తన సొంత నియోజకవర్గం హిందూపూర్ లో పర్యటించారు. అక్కడ ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. దటీజ్ బాలయ్య అనిపించేలా ఆయన టూర్ సాగుతోంది.
బిజీ బిజీగా :
ఇదిలా ఉంటే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలయ్య అంతా కలియ తిరుగుతున్నారు. ఆయన పర్యటన కార్యకర్తలు అభిమానుల ఉత్సాహం మధ్య బ్రహ్మాండంగా సాగుతోంది. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బాలయ్య అదే పనిగా వరసబెట్టి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా శంకుస్థాపనలు, భూమి పూజలు జలహారతి ఇలా ఒకటేమిటి బాలయ్య ఫుల్ బిజీబిజీగా గడిపారు. ముఖ్యంగా జేసీబీ ఎక్కి బాలకృష్ణ చేసిన సందడి అయితే కార్యకర్తలలో సరి కొత్త జోష్ నింపింది అని వేరేగా చెప్పాల్సిన పనే లేదు.
సుడిగాలి పర్యటనలో :
ఇక బాలయ్య తన హిందూపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గ్రామ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడమే తన లక్ష్యంగా పెట్టుకుని ఆయన జోరు పెంచుతున్నారు. లేపాక్షి మండలం మానేపల్లిలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 2 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు బాలకృష్ణ భూమి పూజ చేశారు. అలా కేవలం కొబ్బరికాయ కొట్టి వదిలేయడమే కాకుండా.. స్వయంగా జేసీబీ స్టీరింగ్ పట్టి బాలయ్య అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక బాలయ్య జేసీబీపై కూర్చుని డ్రైవింగ్ చేస్తుంటే అక్కడ ఉన్న వారు ఎవరైనా ఆగుతారా. కార్యకర్తలు అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. జై బాలయ్య అంటూ హోరెత్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.
తన మార్క్ తో :
బాలయ్య ఎంత బిజీగా ఉన్నా హిందూపురం అభివృద్ధి విషయంలో ఎపుడూ వెనక్కి తగ్గలేదు సరికదా ఎపుడు ఎక్కడ ఏది అవసరమో అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. అలా తన సొంత సీటులో అభివృద్ధి పనుల్లో తనదైన శైలిలో బాలయ్య జోరు పెంచారనే చెప్పాల్సి ఉంటుంది. ఇక తన టూర్ లో భాగంగా పులమతి వద్ద హంద్రీనీవా జలాలు చేరుకున్న సందర్భంగా బాలకృష్ణ జలహారతి ఇచ్చారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు అందడమే తన ప్రాధాన్యతని గట్టిగా స్పష్టం చేశారు. ఇక తన పర్యటనలో భాగంగా బాలయ్య ప్రతి గ్రామాన్ని పలకరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని చాటి చెబుతున్నారు. మొత్తానికి హిందూపురంలో బాలయ్య టూర్ అంతా ఉత్సాహంగా సాగింది.
