Begin typing your search above and press return to search.

బాబు తరువాత బాల బాబాయ్ సీఎం...!

ఆయన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబే సీఎం అభ్యర్ధి అని ఒక మాట అనేసారు. అయితే బాబు తరువాత చాన్స్ మాత్రం కచ్చితంగా బాల బాబాయ్ దే అని కొత్త సూత్రం చెప్పారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 2:45 AM GMT
బాబు తరువాత బాల బాబాయ్ సీఎం...!
X

టీడీపీలో ప్రస్తుతానికి సీఎం అభ్యర్ధి ఒకే ఒక్కరు. కానీ నందమూరి వంశీకులు మాత్రం మరో పేరు చెబుతున్నారు. అదే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ పేరు. బ్రీత్ సినిమా గురించి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎన్టీయార్ పెద్ద కుమారుడు నందమూరి జయక్రిష్ణ తనయుడు నందమూరి చైతన్య క్రిష్ణ ఏపీ రాజకీయాల మీద టీడీపీలో సీఎం పదవి విషయంలోనూ సంచలన కామెంట్స్ చేశారు.

ఆయన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబే సీఎం అభ్యర్ధి అని ఒక మాట అనేసారు. అయితే బాబు తరువాత చాన్స్ మాత్రం కచ్చితంగా బాల బాబాయ్ దే అని కొత్త సూత్రం చెప్పారు. బాబు తరువాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత కచ్చితంగా బాలక్రిష్ణ బాబాయ్ కే అని చెప్పేశారు. ఆ తరువాత మాత్రమే నారా లోకేష్ అని వరస క్రమాన్ని అలా వివరించారు.

తెలుగుదేశం పార్టీని నందమూరి నారా కుటుంబాలు రెండూ కలసి రక్షించుకున్నాయని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. లక్ష్మీ పార్వతి తన తాత ఎన్టీయార్ జీవితంలో ప్రవేశించిన తీరుని ఆయన ప్రస్తావిస్తూ అవన్నీ చేదు ఘటనలు అన్నారు. తన తండ్రి జయక్రిష్ణకు కూడా ఇది ఇష్టం లేదని అన్నారు.

ఇదిలా ఉంటే బాలక్రిష్ణ సీఎం అని చైతన్య క్రిష్ణ అనడమే ఇపుడు చర్చకు వస్తోంది. తెలుగుదేశంలో చంద్రబాబు తరువాత నారా లోకేష్ అని పార్టీలో ఒక భావన ఉంది. ఆ విధంగానే పార్టీని బాబు డిజైన్ చేసి ఉంచారు. బాలయ్య రెండు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యే అయినా 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నా కూడా బాలయ్యకు మంత్రి పదవి దక్కలేదు అని కూడా గుర్తు చేస్తున్నారు

అప్పట్లో చట్ట సభలలో మెంబర్ కూడా కానీ నారా లోకేష్ కి అయిదు కీలక శాఖలు ఇస్తూ మంత్రిని చేసారు బాబు. ఆ విధంగా తన వారసుడు ఎవరో చెప్పేసారు అని అంటున్నారు. అయితే చైతన్య క్రిష్ణ మాత్రం బాబుకు చినబాబుకు మధ్యలో బాలక్రిష్ణని చేర్చారు. బాలక్రిష్ణ తప్పకుండా సీఎం అవుతారు అని కూడా అంటున్నారు

ఆయన ఇటు రాజకీయాల్లో ఉంటూ అటు సినిమాల్లోనూ రాణిస్తున్నారు అని కూడా అబ్బాయ్ కితాబు ఇస్తున్నారు. ఇక హిందూపురం నుంచి మూడవసారి పోటీకి బాలయ్య తయారు అవుతూంటే ఆయనకు ఈసారి టికెట్ దక్కుతుందా అన్న ప్రచారం కూడా మరో వైపు ఉంది. అక్కడ నుంచి లోకేష్ పోటీకి దిగుతారు అని అంటున్న వారూ ఉన్నారు. బాలయ్యను ప్రచారానికి వాడుకుంటారు అని కూడా అంటున్నారు.

ఏది ఏమైనా నందమూరి వంశీకులకు సీఎం పదవి దక్కాలన్నది చైతన్య క్రిష్ణ మాటల ద్వారా వ్యక్తం అవుతోంది. ఇక తాను లేటెస్త్ గా నటించిన బ్రీత్ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి మొత్తం నందమూరి కుటుంబాన్ని పిలుస్తాను అని ఆయన చెబుతున్నారు. రాజకీయంగా చైతన్య క్రిష్ణ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.